Oct 19,2023 06:30

రాష్ట్రంలో ఇళ్ళ సమస్య తీవ్రంగా ఉన్నది. కేవలం పేదలకు మాత్రమే కాదు. మధ్యతరగతి ప్రజలకు కూడా ఇంటి నిర్మాణం అనేది తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా భూముల రేట్లు విపరీతంగా పెరగటంతో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది.
2018 నాటికి ఆంధ్ర ప్రదేశ్‌ పట్టణాలలో సొంత ఇళ్ళు గల వారు 43.3 శాతం, అద్దెలకు వుండేవారు 49.9 శాతం, ఇతరులు 6.8 శాతం ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకంలో దాదాపు సగం మంది సొంత ఇళ్ళు లేనివారని అర్ధం అవుతున్నది. పట్టణాలలో 36,54,000 కుటుంబాలు ఉన్నాయి. దీని ప్రకారం చూసినా 18,23,346 కుటుంబాలకు సొంత ఇళ్లు లేవు. వీరందరికీ గృహాలు నిర్మించాలంటే మన రాష్ట్రంలో 18,23,346 ఇళ్లు కావాలి. కాని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ (పిఎంఎవై-యు) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన ఇళ్లు16,84,502. అందులో నిర్మించ తలపెట్టినవి 13,92,855. నిర్మించ తలపెట్టిన గృహాలకుగాను కేంద్ర ప్రభుత్వం మొదటి కిస్తీగా రూ. 4032 కోట్లు విడుదల చేస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2556 కోట్లు విడుదల చేసి మిగిలిన రూ. 1476 కోట్లు దారి మళ్ళించిందని, ఈ రూ. 1476 కోట్లుతో బాటుగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 885 కోట్లు తక్షణమే విడుదల చేయాలని పిఎంఎవై అధికారులు కోరినట్లుగా 'మింట్‌' పత్రిక (27.10.2022) తెలియజేసింది. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, మన రాష్ట్రంలో 21.76 లక్షల ఇళ్ళ నిర్మాణాలు చేపట్టామని, అందులో 7.43 లక్షల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల సామర్లకోట సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందే 16,84,502 అయితే, అందులో నిర్మించ తలపెట్టినవే 13,92,855. అయితే రాష్ట్రంలో 21.76 లక్షల ఇళ్ళు నిర్మాణాలు చేపట్టామని చెప్పటం ఆలోచించాల్సిన విషయమే. కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకన్నా సుమారు 4.92 లక్షల ఇళ్ళు అదనంగా నిర్మిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పారు. అదనంగా నిర్మించే ఈ ఇళ్ల ఖర్చును కేవలం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదా అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి.
ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా 21.76 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయి, లబ్ధిదారులకు అందిస్తే రాష్ట్రంలో అందరికీ సొంత ఇళ్లు లభిస్తాయి. అయితే ఈ ఇళ్ళ నిర్మాణం కేవలం పేదలకు ఉద్దేశించినది మాత్రమే. రాష్ట్రంలో అన్ని పట్టణాలలో మధ్యతరగతి వారు అద్దెకు ఉంటున్నారు. మధ్యతరగతి వారికి ఇళ్లు నిర్మించటం లేదు. గతంలో హౌసింగ్‌ బోర్డు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీలు గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు అల్పాదాయ వర్గాలకు ఎల్‌ఐజి పేరుతో, మధ్య ఆదాయ వర్గాల వారికి ఎమ్‌ఐజి పేరుతో, అధిక ఆదాయ వర్గాలకు హెచ్‌ఐజి పేరుతో స్థలాలు కేటాయించటం, ఇళ్ళు నిర్మించటం చేసేవి. నేడు మధ్య ఆదాయ వర్గాల వారికి, అధిక ఆదాయ వర్గాల వారికి ఇళ్ళు లేదా ఇళ్ళ స్థలాలు కేటాయించటం లేదు. రియల్‌ ఎస్టేట్‌ విపరీతంగా పెరగటంతో మధ్యతరగతి వర్గం స్థలం కొని ఇళ్ళు నిర్మించుకోలేక అపార్టుమెంట్లు కొనుక్కుంటున్నారు. వాటి ధరలు కూడా విపరీతంగా పెరగటంతో పట్టణాల శివారు ప్రాంతాలలో నిర్మించే అపార్టుమెంట్లు తక్కువ ధరకు దొరుకుతాయని శివారు ప్రాంతాల వైపు వెళ్తున్నారు. కొంత మందికి అవి కూడా అందుబాటులో ఉండటంలేదు. నేడు మధ్యతరగతి వారు కారు కొనగలరు. కాని, స్థలం కొని ఇల్లు నిర్మించుకొనే పరిస్థితి లేకుండా పోయింది.
ఇల్లు ఎలా ఉండాలి అనే అంశంపై అనేక కేసులలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. 1996లో ''చిమేలీ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌'' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ''నివాస హక్కు (రైట్‌ టు షెల్టర్‌) అంటే కేవలం శరీరానికీ, అవయవాలకు మాత్రమే నివాసం కాదు. సగటు మనిషి మానసికంగా, శారీరకంగా మేధోపరంగా, తాత్వికంగా ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. నివాస హక్కు అంటే ఆ నివాసం మనిషి జీవించేందుకు వీలైన ప్రదేశం, చక్కని నిర్మాణం, పరిశుభ్రమైన పరిసరాలు, తగినంత గాలి, వెలుతురు, స్వచ్ఛమైన నీరు, విద్యుత్‌, మురుగునీటి పారుదల సౌకర్యం, మిగిలిన ఇతర సౌకర్యాలు (రహదారులు లాంటివి) ఉండి, వారు తమ రోజువారీ వృత్తులు చేసుకునేటందుకు అనువుగా ఉండటం' అని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి మానసికంగా, శారీరకంగా మేధోపరంగా, తాత్వికంగా ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా శాశ్వత నివాసం ఉండాలని, ఇది కల్పించటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది.
కొన్ని కోర్టు తీర్పులను బట్టి మనం ఈ విషయాలను నిర్ధారించవచ్చు. నివాస గృహాలను కేటాయించడం ప్రభుత్వంలో ఉన్న పార్టీల భిక్ష కాదు. నివాసం పొందటం ప్రజల హక్కు. గృహ వసతి కల్పించడమంటే ప్రభుత్వంలో ఉన్న వారికిష్టమైన రీతిలో నిర్మించడం కాదు. కుటుంబం జీవించేందుకు తగిన ప్రదేశంలో, చక్కని నిర్మాణంతో ఇల్లు నిర్మించాలి. సరిపడినంత ఇల్లు ఉండాలి. అంటే కుటుంబానికి కనీసం 120 చ.గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పరిశుభ్రమైన పరిసరాలు, తగినంత గాలి, వెలుతురు, స్వచ్ఛమైన నీరు, విద్యుత్‌, మురుగు నీటి పారుదల, రహదారులు కల్పించాలి. విద్య, వైద్యం లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలి. తమ ఉపాధికి వీలైనంత దగ్గరగా ఉండాలి. నివాస గృహం కేటాయించడం వలన ఉపాధి కోల్పోకూడదు.
వీటన్నింటిని తుంగలో తొక్కి మన ప్రభుత్వాలు కేవలం 25 చ.మీ.లలో ఇరుకు గదులు నిర్మించి ఇస్తున్నాయి. పాత మురికి వాడల నుంచి జనాన్ని తరలించి నూతన మురికి వాడలను తయారు చేస్తున్నాయి. పేదలకు అపార్టుమెంట్లు నిర్మించి ఇళ్లు కేటాయిస్తున్నారు. వీటి వలన అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ముఖ్య సమస్యలు...
ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత అవుసరాలు ఉంటాయి. ఇంట్లో నివాస స్థలం చిన్నది కావటంతో ఎదిగే పిల్లలు ఉన్న కుటుంబంలో తల్లిదండ్రులకు గోప్యత ఉండటంలేదు. ప్రభుత్వాలు నిర్మించి ఇచ్చే అపార్టుమెంట్లకు లిఫ్టు సౌకర్యం ఉండదు. దానితో పైఅంతస్తులలో ఉండేవారు పైకి కిందకు దిగటం ఇబ్బంది అవుతున్నది. ప్రభుత్వాలు నిర్మించి ఇచ్చే అపార్టుమెంట్లకు అసోసియేషన్లు లేవు. దాని నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగం చేతిలోనే ఉంటుంది. దీనితో ప్రతిదానికి స్ధానిక అధికార యంత్రాంగం మీద ఆధారపడవలసి వస్తున్నది. వాటర్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌, డ్రైనేజి సమస్యలు, మంచినీటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని వ్యక్తులుగా పరిష్కరించుకోలేరు. అపార్టుమెంట్‌లో ఉన్న వారందరూ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి. ఈ అపార్టుమెంట్‌ ఇచ్చేదే పేదలకు. ఇల్లు ఇచ్చినంత మాత్రాన వారు వెంటనే ధనవంతులైపోరు. నెలనెలా మెయింటెనెన్స్‌ చెల్లించగలిగే స్తోమత కూడా వారిలో చాలామందికి లేదు. మంచి నీటి కోసం 3, 4 అంతస్తుల నుండి కిందకుదిగి మంచి నీరు పట్టుకొని ఆ బరువుతో మరల అన్ని అంతస్తులు ఎక్కవలసి వస్తున్నది. ఇది చాలా ఇబ్బందికరంగా తయారయింది. మున్సిపల్‌ వాటర్‌ వచ్చిన సమయంలోనే మోటారు ద్వారా 4 అంతస్తులపైన ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకుకు నీరు ఎక్కిస్తారు. మోటారు చెడి పోయినా, లేక మధ్యలో ట్యాంకులో నీరు అయిపోయినా, వాడుక నీటికి కూడా అన్ని అంతస్తులు దిగి నీటిని పైకి మోసుకు పోవలసిందే. ఇప్పటికీ కొంతమంది పేదలు వంటకు, లేదా నీళ్లు కాచుకోవటానికి కట్టెల పొయ్యి మీద ఆధారపడేవారు ఉన్నారు. ప్రభుత్వాలు నిర్మించి ఇచ్చే అపార్టుమెంట్లలో కట్టె పొయ్యి పెట్టుకునే అవకాశంలేదు. కొంతమంది నెలనెలా గ్యాస్‌ కొనుక్కునే స్థోమత లేనివారుకూడా ఉన్నారు. వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వాలు నిర్మించి ఇచ్చే అపార్టుమెంట్ల నిర్మాణం నాశిరకంగా ఉండటంతో పైఅంతస్తుకు నిర్మించిన శ్లాబు కారటం. వాటర్‌ ట్యాంకులు కారటం జరుగుతున్నది. వీటి రిపేరు వారికి పెద్ద సమస్యగా మారింది. పేదవాడు తన పనికి ఉపయోగపడక పోయినా ప్రభుత్వాలు నిర్మించి ఇచ్చే అపార్టుమెంట్లకు వెళ్ళవలసిందే. దీంతో కొంతమందికి ఆ ఇళ్లు తమ పనికి ఆటంకంగా తయారవుతున్నాయి. రోడ్లు విశాలంగా వదిలినప్పటికీ ఆ అపార్టుమెంట్లలో జీవనం ఆధునిక మురికివాడలను తలపిస్తున్నాయి.

  • మధ్యతరగతి గృహ నిర్మాణ సమస్య

సాధారణంగా ఒక ప్రాజక్టు మొత్తం ఖరీదులో భూమి ధర 20 శాతానికి మించకూడదు. కాని ప్రస్తుత పరిస్థితిలో కొన్ని సందర్భాలలో ఇల్లు కట్టుబడి ఖర్చుకన్నా భూమి ధర మించి పోతున్నది. దీనితో ఇల్లు కట్టుకుందామనుకున్న మధ్యతరగతి ప్రజలకు స్థలం కొని తన అభిరుచికి తగినట్లుగా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోతున్నది. అందువలన మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అయితే మధ్యతరగతి వర్గానికి ఇళ్ళు ఉచితంగా ఇవ్వనవసరంలేదు. ఆనాటి గృహ నిర్మాణ ధరలో 20 శాతానికి మించకుండా భూమి రేటును నిర్ణయించి ప్రభుత్వమే మధ్యతరగతి ప్రజలకు అమ్మాలి.

 వ్యాసకర్త : యం.వి. ఆంజనేయులు, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ, విజయవాడ