- భద్రాచలంలో మూడు, రాజమహేంద్రవరంలో రెండో ప్రమాద హెచ్చరికలు
- విలీన మండలాలను, లంకలను చుట్టుముట్టిన వరద నీరు
ప్రజాశక్తి-యంత్రాంగం : గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. వాయుగుండం కారణంగా ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద తాకిడి మరింత ఎక్కువైంది. వారం రోజులుగా కొనసాగుతోన్న వరద గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా విలీన మండలాల ప్రజలకు, లంక గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భద్రాచలం వద్ద తగ్గినట్టే తగ్గిన వరద శుక్రవారం ఉదయం నుంచి మళ్లీ పెరిగింది. గురువారం సాయంత్రానికి 46 అడుగులకు తగ్గింది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. శుక్రవారం రాత్రికి 53.10 అడుగులకు మళ్లీ పెరిగింది. దీంతో, ఇక్కడ మళ్లీ మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, కోనసీమలోని పరివాహక ప్రాంతాలు, లంకలను వరద నీరు చుట్టుముట్టింది.. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద 13.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో, ఈ బ్యారేజీ 175 గేట్ల ద్వారా 13 లక్షల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 24 గంటలుగా ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమల్లోనే ఉంది. తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వలకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని పాత బ్రిడ్జి వద్ద 14.90 మీటర్లు నీటిమట్టం ఉంది.
- నీట మునిగిన లోతట్టు లంక గ్రామాలు
కోనసీమ లంక గ్రామాలను వరద నీరు చుట్టిముట్టింది. లోతట్టు లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. కాజ్‌వేలు నీటమునిగాయి. సఖినేటిపల్లి మండలంలోని అప్పనారామునిలంక, సఖినేటిపల్లిలంక, కొత్తలంక, టేకిశెట్టిపాలెంలోని కొంతభాగం, మలికిపురం మండలంలోని రామరాజులంక, బాడవ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. టేకిశెట్టిపాలెంలో నివాసాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో ఏటిగట్టుపై గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.
- 200 కుటుంబాలను కివ్వాక పునరావాస కాలనీకి తరలింపు
ఏలూరు జిల్లా పోలవరం ఎగువ కాఫర్ డ్యాం వద్ద 34.300 మీటర్ల నీటిమట్టం నమోదైంది. వెంకటాపురం గ్రామం, ఎస్‌సి కాలనీకి మధ్య రోడ్డుపైకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద పెరుగుతుండడంతో అధికారులు కుక్కునూరులోని 'ఎ' బ్లాక్, రామాలయం సెంటర్, దాసరి బజార్, రజక బజార్‌కు చెందిన 200 కుటుంబాలను కివ్వాక పునరావాస కాలనీకి తరలించారు. కౌండిన్యముక్తికి చెందిన దాదాపు 50 కుటుంబాలను పునరావాస కేంద్రానికి, వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు.
- పోలవరం ఎమ్మెల్యే నిలదీత
వరద బాధితులను పరామర్శించేందుకు వేలేరుపాడు వచ్చిన పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజును స్థానికులు అడ్డుకున్నారు. తమకు పరిహారం ఎప్పుడిస్తారంటూ నిలదీశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తానని ఎంఎల్‌ఎ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
- అల్లూరి జిల్లాల్లో వంద గ్రామాలకు తెగిపోయిన సంబంధాలు
గోదావరి వరద ఉధృతి కొనసాగుతుండడం, వాగులు, వంకలు పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లో వంద గ్రామాలకు సంబంధాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 40 అడుగులు నమోదైంది. సోకిలేరు, చంద్రవంక, చీకటి వాగులు రహదారులపైనుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విఆర్.పురం మండలం రామవరం, గుర్రంపేట, నూతిగూడెం, కన్నాయిగూడెం కాలనీ, వడ్డిగూడెం, ధర్మతాల గూడెం, వడ్డిగూడెం కాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. వరద ముంపునకు గురైన వారికి ఎర్రగట్టు, చలంపాలెం, సీతాపురం, గన్నవరం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 102 కుటుంబాలకు చెందిన 337 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
- కొమ్మూరు గ్రామస్తుల జలదీక్ష
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న చింతూరు మండలం కొమ్మూరు గ్రామ ప్రజలు శుక్రవారం నీటిలో దిగి జలదీక్ష చేపట్టారు. 41.15 కాంటూరులో తమ గ్రామాన్ని చేర్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
- సిపిఎం బృందాల పర్యటన
ఎటపాక మండలంలోని ముంపు గ్రామాల్లో సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బప్పెన కిరణ్, తదితరులు పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని, బోట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కూనవరం, విఆర్.పురం, చింతూరుల్లోనూ పలు ప్రాంతాల్లో సిపిఎం బృందాలు పర్యటించాయి.
- 'ప్రజాశక్తి' కథనాలకు స్పందన
విఆర్.పురం మండలం రామవరం, గుర్రంపేట, నూతిగూడెం, కన్నాయిగూడెం కాలనీ, వడ్డిగూడెం, ధర్మతాల గూడెం, వడ్డిగూడెం కాలనీల ప్రజలు వరదల సమయంలో పడుతున్న అవస్థలపై 'ప్రజాశక్తి' కొద్ది రోజులుగా ఇచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. ఆయా గ్రామాల్లో కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, క్యాబేజీలు అందజేశారు. రేఖపల్లి పునరావాస కేంద్రంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
- జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పునరుద్ధరణ
ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో, గురువారం మధ్యాహ్నం నుండి విజయవాడ - హైదరాబాద్ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు మళ్లీ కొనసాగుతున్నాయి. జాతీయ రహదారిపై అక్కడక్కడా గుంటలు పడడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు.
- ప్రకాశం బ్యారేజీకి భారీగా పెరిగిన వరద
ప్రకాశం బ్యారేజీకి శుక్రవారం సాయంత్రం వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఎగువ నుంచి 2.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా మొత్తం అన్ని గేట్లు ఎత్తి వేసి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, నల్గండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతోపాటు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజి ఎగువన కురిసిన వర్షాలతో మున్నేరు, కట్టలేరు, బుడమేరు, పాలేరు తదితర ప్రాంతాల నుంచి వరద వస్తోంది. దీంతో, వరద పెరిగి మూడు లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నిల్వ సామర్థ్యం 3.07 టిఎంసిలు కాగా, గత కొద్ది రోజులుగా ఇదే స్థాయిలో నీటి నిల్వ కొనసాగుతోంది. సాగర్‌కు దిగువన, పులిచింతల ఎగువన కురిసిన వర్షాలతో పులిచింతల జలాశయానికి సాయంత్రం 1,28,171 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ నుంచి 6,290 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నారు.










