Oct 07,2023 06:59
  • ఎపి ప్రజల ఆందోళనను పరిగణనలోకి తీసుకోండి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కృష్ణాజలాలపై వాస్తవాలను, న్యాయపరమైన చిక్కులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు నిలిపేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద మోడీని కోరారు. ఈ మేరకు శుక్రవారం లేఖ రాశారు. కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పున:పంపిణి చేయాలంటూ కంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. అంతర్రాష్ట్ర్ర నదీజల వివాదాల చట్టం 1956 సెక్షన్‌ 5(1) ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్‌-2కి విధివిధానాలు కోసం నివేదించిన విషయాన్ని ఈ లేఖలో సిఎం ప్రస్తావించారు. 2014 జులై 14న తెలంగాణా రాష్ట్రం చేసిన అభ్యర్థన ఫిర్యాదు ప్రకారం కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల కృష్ణానది ప్రవాహాలపై అధారపడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే నూతన విదివిధానాలను పరిమితం చేయండం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ఇతర రెండు రాష్ట్రాలు(మహారాష్ట్ర, కర్నాటక) పూర్తిగా మినహాయించాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయమని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాబినెట్‌ నిర్ణయం జాతీయ ఆస్తి అయిన నీటి వనరులను న్యాయంగా వినియోగించుకోవడానికి వ్యతిరేకమైందని తెలిపారు. 1956 నాటి అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టంలోని సెక్షన్‌ 5 ప్రకారం కృష్ణా జల వివాద ట్రిబ్యునల్‌-1(బచావత్‌)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇది ఇచ్చిన తుది నివేదిక అధారంగా 1976 మే 31న గెజిట్‌ చేశారని తెలిపారు. కృష్ణానదిలో 2130 టిఎంసిల నీరు అందుబాటులో ఉందని బచావత్‌ ట్రిబ్యునల్‌ లెక్కగట్టిందని పేర్కొన్నారు. 75 శాతం ప్రవాహాలు ఉంటాయన్న అంచనాతో ఈ లెక్కవేసిందని, దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 811 టిఎంసిల నీటిని కేటాయించారని తెలిపారు. 2130 టిఎంసిల కన్నా అధికంగా ఉన్న నీటిని మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి స్వేచ్ఛను ఇచ్చిందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 సెక్షన్‌ 6(1) ప్రకారం బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన అవార్డును సుప్రీం కోర్టు డిక్రీ ద్వారా అమల్లోకి వచ్చిందని తెలిపారు. అనంతరం 1956 చట్టంలోని సెక్షన్‌ 4(1) ప్రకారం 2004 ఏప్రిల్‌ రెండోతేదీన కేంద్రం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ ట్రిబ్యునల్‌ 2010 డిసెంబర్‌ 30వ తేదీన తన నివేదికను సమర్పించిందని, సెక్షన్‌ 5(3) ప్రకారం బచావత్‌ ట్రిబ్యునల్‌ ద్వారా 75 శాతం డిపెండబులిటీతో చేసిన 2130 టిఎంసిల కేటాయింపులను నిర్థారిస్తూ తన తదుపరి నివేదికను సమర్పించిందని లేఖలో ప్రస్తావించారు. దీంతోపాటు బేసిన్‌ రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65 శాతం అధారపడదగిన అదనపు నీటిని కేటాయించిందని వివరించారు. దీని కింద పూర్వపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 194 టిఎంసిలు కేటాయించారని వివరించారు. పూర్వపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మొత్తం 1005 టిఎంసిలకు చేరుతుందని వివరించారు. దీంతోపాటు 2578 టిఎంసిల కంటే ఎక్కువగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్వేచ్ఛను ఇచ్చిందని పేర్కొన్నారు. రెండో ట్రిబ్యునల్‌ నిర్ణయాలను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో నదీజలాలపై అధారపడ్డ రాష్ట్రాలు 5 ఎస్‌ఎల్‌పిలు దాఖలు చేశాయని తెలిపారు. సెక్షన్‌ 5(1) ప్రకారం రెండో ట్రిబ్యునల్‌ నివేదికను పక్కన బెట్టాలంటూ పూర్వపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సుప్రీం కోర్టును అభ్యర్థించిందని మోడీకి రాసిన లేఖలో జగన్‌ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ద్వారా 2011 సెప్టెంబర్‌ 16వ తేదీన రెండో ట్రిబ్యునల్‌పై స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. అన్ని ఎస్‌ఎల్‌పిలు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యను కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి 2021 ఆగస్టు 17వ తేదీన, 2022 జూన్‌ 25వ తేదీన రెండుసార్లు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగం రాకుండా చట్టపరంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ చేసిన తాజా నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందని వెంటనే దాని అమలు నిలిపేయాలని కోరారు.