ప్రజాశక్తి-రాంబిల్లి : సిఎం పర్యటన ప్రాంతాల్లో సిపిఎం, ప్రజాసంఘాల నేతలను పోలీసులు గృహ నిర్భంధించారు. ఈరోజు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సేజ్ లో పర్యటనకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అచ్చుతాపురం, రాంబిల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజల సమస్యలు, కార్మిక సమస్యలు, నిర్వాసితుల సమస్యలపై వినతి పత్రాలు ఇస్తామని తెలపడంతో ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం సిపిఎం నాయకులను, ప్రజాసంఘాల నాయకులను గృహనిర్బందించారు. ఇంటి వద్దకు వచ్చి అరెస్టు చేయడం జరిగిందని అనకాపల్లి జిల్లా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతకాయల శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అధినేత, ముఖ్యమంత్రివర్యులు మన ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో సంవత్సరాల తరబడి, పరిష్కారం కానీ ఎస్సీ జడ్, ఎన్ ఏ ఓ బి నిర్వాసితుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించారని తెలిపారు. కనీసం సమస్యలు నిరసన రూపంలోనైనా తెలపాలని నిర్ణయించుకున్న ప్రజాసంఘాల నాయకులను, సిపిఎం నాయకులను ఎక్కడకక్కడ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఈ రోజు తెల్లవారు నాలుగున్నర గంటలకు ఇంటి వద్ద నిద్రపోతున్న తనను లేపి అరెస్టు చేసి రాంబిల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, మాట తప్పను మడము తిప్పను అన్న ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత సమస్యలపై అనేక హామీలు ఇచ్చి ఉన్నారని అన్నారు. వాటిని అమలు చేయమంటే అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకొని ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు.