Jul 27,2023 07:28
  • రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు
  • విజయవాడ దుర్గమ్మ ఘాట్‌రోడ్డు మూసివేత
  • ఆంధ్ర- తెలంగాణకు
  • నిలిచిన రాకపోకలు
  • పిడుగుపాటుకు ఒకరు మృతి

ప్రజాశక్తి - యంత్రాగం : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేకుండా వాన పడుతూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్‌ రోడ్డును మూసివేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలోని కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆంధ్ర-తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో మూరు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
విశాఖలోని పూర్ణామార్కెట్‌, కాన్వెంట్‌ జంక్షన్‌, రైల్వే న్యూకాలనీ, జ్ఞానాపురం, షీలానగర్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాన్వెంట్‌ జంక్షన్‌లోని రైల్వే వంతెన వద్ద భారీగా నీరు చేరడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకారులు సముద్రములోకి వేటకు వెళ్లరాదని, ఇదివరకే వేటకు వెళ్లిన వారిని వెనుకకు రప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ను విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాదల పంచాయతీ బోరిగుడ గ్రామంలో పశువులను మేతకు తీసుకెళ్లిన సమయంలో పిడుగుపడటంతో గ్రామానికి చెందిన గుబ్బాయి రాజు మృతి చెందాడు. భారీ వరదల కారణంగా విఆర్‌.పురం మండలం అన్నవరం, అడివి వెంకన్నగూడెం వాగులు పొంగి 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జడివాన కురిసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఘాట్‌ రోడ్‌ను తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం రాత్రి ఇంద్రకీలాద్రి పైనుండి చిన్న చిన్న కొండరాళ్లు పడడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నందిగామ మండలం కూడలి పల్లెంపల్లి నుండి మధిర మండలం చిలుకూరు వద్ద కట్టలేరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంపలగూడెం వద్ద కట్టలేరు వంతెన మునిగిపోవడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సుమారు 15 వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జగనన్న కాలనీ నీట మునిగింది. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం దుర్గమ్మ గుడి వద్ద జలవాగు, గంగినీడుపాలెం వద్ద ముగ్గురాళ్ల వాగుల ఉధృతికి టి.నరసాపురం - మక్కినవారిగూడెం, బండివారిగూడెం - మక్కినవారిగూడెం తదితర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పట్టెన్నపాలెం సమీపంలోని వాగు ఉధృతికి జంగారెడ్డిగూడెం మండలానికి రాకపోకలు స్తంభించాయి. బలివే గ్రామపరిధిలోని తమ్మిలేరుపై తాత్కాలిక రహదారి వంతెనకు గండిపడటంతో వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని సిరిపల్లి, నేదునూరు గ్రామాల్లోని పంటపొలలు నీట మునిగాయి. ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో పంచాయతీ చెంతనే ఉన్న పెంకుటిల్లు కప్పు కూలిపోయింది. వద్దిపర్రు గ్రామంలో ఒక మహిళ ఇంట్లో ఉండగా ఇంటి పైకప్పు ఆమెపై కూలిపోవడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో మహేంద్రతనయలో 450 క్యూసెక్కుల వరద ప్రవాహం పెరిగింది. హిరమండలం గొట్టాబ్యారేజీలోకి 8,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. విజయనగరంలోని పలు లోతట్టు జలమయమయ్యాయి. తోటపల్లి కుడి కాలువకు బొబ్బిలి మండలం అలజంగి వద్ద గండిపడింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి జడివాన పట్టుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు జడివాన కురవడంతో జనజీవనం స్తంభించింది. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు ఊపందుకోనుంది. సుమారు 4.53 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది.నెల్లూరులో మోస్తరు వర్షం కురిసింది.
ప్రకాశం జిల్లా, నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షం నీరు పోటెత్తడంతో జె. పుల్లలచెరువు గ్రామసమీపంలోని నెమలిగుండం పొంగిపొర్లుతోంది. ఈ వరద నీరు గుండ్లకమ్మ వాగు ద్వారా కంభం చెరువుకు చేరుతోంది. దోర్నాల-కర్నూలు ఘాట్‌ రోడ్డులో రోళ్లపెంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. కర్నూలు నుంచి దోర్నాల, దోర్నాల నుంచి కర్నూలు వెళ్లే వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. రోళ్లపెంట సమీపంలో రహదారిపై బండరాళ్లు పడటంతో పోలీసులు వాటిని తొలగించారు.గుంటూరు, పల్నాడు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అమరావతి వద్ద పెదమద్దూరు వాగు పొంగి ప్రవహించింది. దీంతో విజయవాడ- అమరావతి మధ్యరాకపోకలు నిలిచిపోయాయయి. పల్నాడు జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం ఏర్పడింది.

  • శ్రీకాకుళంలో అధిక వర్షపాతం

శ్రీకాకుళం జిల్లా తమడ గ్రామంలో 145 మి.మీ, ఎచ్చెర్లలో 114, పైడిభీమవరంలో 90, విశాఖ జిల్లా రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో 90మి.మీ, జూ ప్రాంతంలో 102, విజయనగరం గోవిందపురంలో 136 మి.మీ వర్షపాతం నమోదైంది. అనంతపురం, కడపలో అత్యల్పంగా 8 మి.మీ నమోదైంది. నెల్లూరులోనూ ఇదే పరిస్థితి.