నీ చుట్టూ గోడను కట్టి
నిన్ను ద్వారపాలకులై
కాపలా కాస్తారు కొందరు
నువ్వు అప్పుడు ఇక ఒక సమాధివి !
నువ్వు వద్దన్నా వినక
నిన్ను పల్లకీలో కూర్చోబెట్టి
బోయీలై మోస్తారు కొందరు
అప్పుడు నువ్వు ఒక ఉత్సవ విగ్రహానివి!
నీ కోసం అద్దాలను పేర్చి
తాము నీ అద్దాలమని
చూసుకూంటూ నడవమంటారు కొందరు
నువ్వప్పుడు ప్రతిబింబించలేని ఒక అద్దానివి!
నీకోసం పందిరి సిద్ధం చేసి
నువ్వొక పాకే మొక్కవని చెప్పి
భూమిలోకి పాతుకుపోమని చెబుతారు కొందరు
అప్పుడు నువ్విక ఒక చిగురించలేని అవస్థవి!
ఎవరెవరో నిన్ను తమ రూపాలను చేస్తారు
చేసామనుకుని ప్రాణం పోయడం విడమరుస్తారు
లేదా నీలో ఉన్న ప్రాణాన్ని విస్మరిస్తారు
నువ్వు, చెబుతావు కదా :
పంజరాన్ని వదిలే చూపుతో, నవ్వుతో
నీ స్వేచ్ఛైక పలుకులతో,
నువ్వొక మనసు ఉన్న
సొంత బుద్ధి ఉన్న
స్వతహాగా చిగురించే
లేతాకులా కాంతులీనే
తళతళా అద్దంలా మెరిసే
ప్రాణంతో చలించే శరీరానివనీ...
పార్ధివ దేహాన్నీ,
పువ్వులతో చుట్టి ఉన్న
సమాధినీ కాదనీ!
... అంతా ఒక గుండె చప్పుడును చేసి...
- అనూరాధ బండి










