హొయిలులు : అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు వ్యాపిస్తోంది. లహైనా నగరంలో ఈ ప్రకృతి విపత్తు భీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 53 మంది మరణించినట్లు హవాయి గవర్నర్ జోష్ గ్రీస్ వెల్లడించారు. ''అనుమానమే లేదు. లహైనాపై బాంబు పడినట్లుగా ఉంది'' అని మౌయి మేయర్ రిచర్డ్ బిస్సెన్ వ్యాఖ్యానించారు. హవాయిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో లహైనా కూడా ఒకటి.
ఈ కార్చిచ్చు కారణంగా 1000కి పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అనేక కార్లు, వాహనాలు కాలిబూడిదయ్యాయి. మంగళవారం రాత్రి ఈ కార్చిచ్చు మొదలైన సంగతి తెలిసిందే. హరికేన్ ప్రభావంతో బలమైన గాలులు వీయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నివాసాలను చుట్టుముట్టాయి. వీధుల్లో దట్టమైన పొగ అలముకుంది. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కొందరు పొగ, మంటల బారి నుంచి తప్పించుకునేందుకు పసిఫిక్ మహాసముద్రంలోకి దూకారు.
పలు ప్రాంతాల నుండి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కార్చిచ్చును ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. మరో వారం రోజులు పట్టవచ్చని తెలిపింది. రహదారులన్నీ కాలిపోయిన వాహనాలు, భవనాలతో నిండిపోయింది. ప్రాథమిక పాఠశాల కూలిపోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిందని ఓ జర్నలిస్ట్ తెలిపారు.










