Jun 08,2023 13:19

ఒట్టావా :   కార్చిచ్చుతో కెనడా, అమెరికాలో సుమారు 100 మిలియన్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమవుతున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కెనడా రికార్డు చరిత్రలో ఈ కార్చిచ్చు అతిపెద్దదని ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో చెప్పారు. ఇప్పటివరకు 3.8 మిలియన్‌ హెక్టార్లల్లో అడవులు కాలిపోయినట్లు కెనడియన్‌ నేషనల్‌ ఫైర్‌ డేటాబేస్‌ పేర్కొంది. గతంలో న్యూజెర్సీలో జరిగిన దానికంటే రెట్టింపు పరిమాణమని పేర్కొంది. కెనడాలో కార్చిచ్చు కారణంగా 20,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. బుధవారం మధ్యాహ్నం నాటికి న్యూయార్క్‌ నగరంలో ప్రపంచంలోని ఏ నగరంలో లేనంత వాయు కాలుష్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దట్టమైన పొగమంచు కాలుష్యం కారణంగా మన్‌హట్టన్‌ నగరంలోని ప్రముఖ ఆకాశహర్మ్యాలు వింతగా, పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తున్నాయి.

దట్టమైన వాయు కాలుష్యం కారణంగా విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయని, క్రీడా కార్యక్రమాలను వాయిదా వేయవలసి వచ్చిందని అధికారులు ప్రకటించారు. న్యూయార్క్‌ యాన్కీస్‌ మరియు చికాగో వైట్‌ సాక్స్‌ మధ్య బుధవారం జరగాల్సిన మేజర్‌ బేస్‌బాల్‌ లీగ్‌తో పాటు డెట్రాయిట్‌ టైగర్స్‌తో జరిగే ఫిల్లీస్‌ హోమ్‌ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అలాగే మహిళల ఎన్‌బిఎ మరియు నేషనల్‌ ఉమెన్స్‌ సాకర్‌ లీగ్‌ కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి. బ్రూక్లిన్‌లో కొరిన్‌ బెయిలీ రే ప్రదర్శించే సంగీత కచేరీ సిరీస్‌కు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

వినాశకరమైన కార్చిచ్చును నివారించేందుకు సహకారం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ట్రూడోకు తెలిపారు. ఇటువంటి కార్చిచ్చులు తమకు రోజువారీ దినచర్యలను, జీవనోపాధిని మరియు వాయు నాణ్యతను ప్రభావితం చేస్తుంటాయని ట్రూడో ట్విటర్‌లో పేర్కొన్నారు. తమకు మద్దతు ప్రకటించినందుకు బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు.