హొనలులు : హవాయిలోని మౌయ్ ద్వీపంలో కార్చిచ్చు వ్యాపించింది. హరికేన్ ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 36 మంది మరణించగా, 20 మంది తీవ్రంగా గాయపడినట్లు మౌయ్ కౌంటీ మేయర్ రిచర్డ్ బిస్సెన్ వెల్లడించారు. గంటకు 80 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. పదికి పైగా ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.
హరికేన్ ప్రభావంతో గంటకు 80 మైళ్ల వేగంతో గాలులు వీస్తుండటంతో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని స్థానిక మీడియా నివేదించింది. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, కార్లు కాలిబూడిదయ్యాయని తెలిపింది. వీధుల్లో దట్టమైన పొగ అలుముకుందని వెల్లడించింది. దీంతో ప్రజలు భయాందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది. ఈ మంటలకు ప్రభావితమైన వారి వివరాలు కచ్చితంగా తెలియలేదని పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారని హవాయి లెఫ్టినెంట్ గవర్నర్ సిల్వియా లూక్ పేర్కొన్నారు. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపారు. మంటల నుండి తప్పించుకునేందుకు పలువురు నివాసితులు సముద్రంలోకి దూకారని, వారిని గుర్తించి రక్షించేందుకు తీర గస్తీదళం యత్నిస్తోందని అన్నారు.