- సమస్యల పరిష్కరించాలని డిమాండ్
ప్రజాశక్తి-చీరాల: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని చిన్నచూపు చూస్తూ వారి హక్కులను కాలరాస్తుందని చేనేత నాయకులు పేర్కొన్నారు. బుధవారం చీరాలలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్ లూమ్స్ కార్యాలయం వద్ద చేనేత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర జనాభా ఐదు కోట్లు అయితే అందులో కోటిన్నర మందికి పైగా చేనేతలు చేనేత ఉపకులాలు ఉన్నాయి.అయితే వీరిలో కొంతమందికి మాత్రమే కొన్ని పథకాలు అందుతున్నాయి.పవర్ లూం వల్ల చేనేతలు నేసిన వస్త్రాలు కొనుగోలు లేక అల్లాడి పోతున్నారు.నేతన్న నేస్తం క్రింద ఇరవై వేల రూపాయలు ఇస్తూ మభ్యపెడుతున్నారు పాలకులు.చేనేతలకు రావలసిన నిధులు కోట్లలో ఉంటే కేవలం రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేశారు. దేశంలో రైతాంగం తరువాత చేనేత రంగం ముఖ్యమైనది అని అటువంటి చేనేత రంగాన్ని,చేనేత కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూడటం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ శీలం వెంకటేశ్వర్లు, పిల్లలమర్రి నాగేశ్వరరావు,సీపీఎం పార్టీ నాయకులు ఫణిదపు కొండయ్య,ఏఐటీయుసి నాయకులు మేడ వెంకట్రావు లు పలువురు నాయకులు పాల్గొన్నారు.










