Feb 02,2023 06:50
  • ద్రవ్య లోటు 5.9శాతానికి కుదిస్తాం - ఆదాయపన్ను పరిమితి పెంపు
  • వార్షిక ఆదాయం రూ.3లక్షల వరకు పన్ను లేదు - వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల ప్రోత్సాహానికి నిధి - నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని రెండవ ప్రభుత్వ చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెడుతూ ప్రపంచం భారత్‌ను ఒక మెరిసే నక్షత్రంగా చూస్తోందని అన్నారు. హరితాభివృద్ధి, యువ శక్తి, సర్వతోముఖాభివృద్ధితో సహా వివిధ ప్రాధాన్యతలు ఇందులో ముడిపడి వున్నాయని అమె తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయపుపన్ను పరిమితిని పెంచడంతో పాటు పన్ను శ్లాబులను ఆరు నుంచి అయిదుకు కుదించారు. 2047 నాటికి స్వాతంత్య్ర భారత్‌కు వందేళ్లు నిండనున్నందున అప్పటికి ఆత్మ నిర్భర్‌ భారత్‌ను సాధించడమే లక్ష్యమని చెప్పారు. . ప్రస్తుత సంవత్సర ఆర్థికాభివృద్ధి రేటు 7శాతంగా వుండగలదని బడ్జెట్‌ అంచనా వేసింది. ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలన్నింటి కన్నా ఇది ఎక్కువ అని ఆమె పేర్కొన్నారు. ద్రవ్య లోటు విషయానికి వస్తే, 2022-23 సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం 6.4శాతం గా ఉంది, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దీనిని జిడిపిలో 5.9శాతానికి తగ్గిస్తామన్నారు.. 2025-26 నాటికి ఈ లోటును 4.5శాతానికన్నా దిగువను ఉండేలా చూడడమే లక్ష్యమని ఆర్థిక మంత్రి సెలవిచ్చారు. ద్రవ్యలోటు తగ్గించే పేరుతో సామాజిక రంగాలకు కేటాయింపుల్లో పలు కోతలు ప్రకటించారు. రైల్వేలకు గత ఏడాది 1.40 లక్షల కోట్లు కేటాయించగా, ఈ సారి 2.40 లక్షల కోట్లు కేటాయిస్తున్నామన్నారు.
ముఖ్యాంశాలు :

  • ఆదాయపుపన్ను పరిమితిని ప్రస్తుతమున్న రూ.5లక్షల నుండి రూ.7లక్షలకు పెంచారు. కొత్త ఆదాయ పన్ను విధానంలో డీఫాల్ట్‌ ఆప్షన్‌గా ఇది వుండనుంది.
  •  కొత్త వ్యక్తిగత ఆదాయపుపన్ను విధానంలో ఆదాయ శ్లాబ్‌లను ప్రస్తుతమున్న ఆరు నుండి 5కి తగ్గించారు. రూ.3లక్షలకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచారు.
  • కొత్తగా వర్తించే పన్ను రేట్ల ప్రకారం రూ.3లక్షల వరకు ఎలాంటి పన్ను వుండదు
  • రూ.3 నుండి రూ6లక్షల వరకు 5శాతం పన్ను విధిస్తారు, రూ.6 నుండి రూ.9లక్షల వరకు 10శాతం పన్ను వుంటుంది, రూ.9నుండి రూ.12 లక్షల వరకు 15శాతం, రూ.12 నుండి రూ.15లక్షలవరకు 20శాతం, రూ.15లక్షలు దాటితే ఏకంగా 30శాతం పన్ను విధిస్తారు.
  • మరోవైపు రైల్వేలకు గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా కేటాయింపులు జరిగాయి. గతేడాది రూ.1.40లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి దాన్ని రూ.2.40లక్షల కోట్లకు పెంచారు. 2013-14తో పోలిస్తే బడ్జెట్‌ కేటాయింపులు ఏకంగా 9రెట్లు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు.
  • అలాగే ద్రవ్య సంఘటిత చర్యలను కొనసాగించడం ద్వారా 2025-26 నాటికి ద్రవ్య లోటును 4.5శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. గత బడ్జెట్‌లో కూడా ఇదే లక్ష్యాన్ని తాను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ ఈ ఏడాది కూడా ఆ పంథాకే కట్టుబడి వున్నామన్నారు.
  • ద్రవ్య లోటును తగ్గించేందుకై తీసుకునే నికర రుణాలు రూ.11.8లక్షల కోట్లు వుంటాయని అంచనా వేశారు. ఇక మిగిలిన నిధులను చిన్న పొదుపు మొత్తాల నుండి, ఇతర వనరుల నుండి తీసుకోవాలని భావిస్తున్నామని మంత్రి తెలిపారు.
  • మూలధన పెట్టుబడుల కేటాయింపులు వరుసగా మూడో ఏడాది 33శాతం పెరిగి 10లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది జిడిపిలో 3.3శాతంగా వుంది.

వృద్ధి అవకాశాలను, ఉపాధి కల్పనను పెంపొందించేందుకు, ప్రైవేటు పెట్టుబడులను సేకరించేందుకు, అంతర్జాతీయంగా వీస్తున్న పెనుగాలులకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇటీవలి సంవత్సరాల్లో గణనీయంగా పెరిగిన ఈ పెంపుదలలు చాలా కీలకమని అన్నారు.

  • వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20లక్షల కోట్లకు పెంచారు. పశు సంరక్షణ, మత్స్య విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో యువ పారిశ్రామికవేత్తలు వ్యవసాయ రంగ స్టార్టప్‌లను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్‌ యాక్సిలేటర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళకు వినూత్నమైన, సమర్ధవంతమైన పరిష్కార మార్గాలు చూపించడం ఈ ఫండ్‌ యొక్క ప్రధాన లక్ష్యంగా వుంటుందని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ పద్దతుల్లో మార్పులు తీసుకురావడానికి, ఉత్పాదకతను, లాభాలను పెంచడానికి ఆధునిక సాంకేతికతలను తీసుకురావడం కూడా ఈ ఫండ్‌ లక్ష్యంగా వుంటుందన్నారు.

పిఎం విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌

మూడేళ్ళలో లక్షలాదిమంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం పిఎం విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సాంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల కళాకారులు తయారుచేసే ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరిచేందుకు, వారి ఉత్పత్తులు అందరికీ చేరువయ్యేలా చేసేందుకు అవసరమైన సాయాన్ని అందిచేందుకు పిఎం విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌ (పిఎం వికాస్‌) పేరుతో దేశంలోనే తొలి ప్యాకేజీ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆర్థికంగా తోడ్పాటును అందించకపోయినా అధునాతనమైన నైపుణ్యాల శిక్షణ, ఆధునిక డిజిటల్‌ సాంకేతికతలు, సమర్ధవంతమైన హరిత సాంకేతికతలు, డిజిటల్‌ చెల్లింపులు, సామాజికభద్రత వంటి వాటికి ఈ పథకం అవకాశం కల్పిస్తుంది.

  • కరోనా సమయంలో చిన్న, మధ్య తరహా సంస్థలు కాంట్రాక్టులను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైనట్లైతే, బిడ్‌కు లేదా సెక్యూరిటీకి సంబంధించి డిపాజిట్‌ చేసిన మొత్తంలో 95శాతాన్ని ప్రభుత్వం లేదా దాని సంస్థలు వెనక్కి తిరిగి ఇచ్చేస్తాయి.

పరపతి హామీ : కార్పస్‌లోకి రూ.9వేల కోట్లను చొప్పించడం ద్వారా ఎంఎస్‌ఎంఇలకు పరపతి హామీ పథకాన్ని పునర్వ్యస్థీకరించారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుండి అమల్లోకి వస్తుంది. రూ.2లక్షల కోట్ల అదనపు కొలేటరల్‌ రహిత హామీ రుణాలకు ఇది అదనంగా వుంటుందని మంత్రి తెలిపారు.
హరిత ఇంధనం : ఇంధన పరివర్తనను సాధించే దిశగా మూలధన పెట్టుబడుల కోసం బడ్జెట్‌లో రూ.35వేల కోట్లు కేటాయించారు.

  • మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ పథకం కింద ప్రస్తుత గరిష్ట పరిమితిని రూ.15లక్షల నుండి రూ.30లక్షలకు పెంచారు.