ప్రజాశక్తి - యంత్రాంగం :కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కోతపెట్టడాన్ని.. అదానికి రాయితీలు కల్పించడాన్ని..ప్రజలపై పన్నుల భారాలు వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.శ్రీకాకుళంలో రామలక్ష్మణ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ మాట్లాడుతూ.. సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం భారాలు మోపి కార్పొరేట్లకు రాయితీలు ఇస్తోందని, సబ్సిడీల్లోనూ కోత పెట్టిందని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా బిజెపి మరోసారి మోసం చేసిందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటిడిఎ వద్ద ఆందోళన చేపట్టారు. తొలుత ఎర్రంపేట నుంచి ఐటిడిఎ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. విలీన మండలాల పర్యటనలో భాగంగా చింతూరు వచ్చిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. పార్టీ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్ మాట్లాడుతూ.. విలీన మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, తెనాలి, దుగ్గిరాల, తాడేపల్లి, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ కృష్ణాజిల్లాలో కేంద్ర ఫ్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ పాల్గన్నారు. బబ్బిలిలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద నిరసననుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రా ప్రజలకు ద్రోహం చేసిన బిజెపిని వైసిపి, టిడిపి, జనసేన పార్టీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిగాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె, కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.మదనపల్లెలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పాల్గన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని పలువురు నాయకులు విమర్శించారు. కర్నూలు కలెక్టరేట్, నంద్యాల తాలూకా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.










