న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదా? ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, బిజెపి నాయకులు ఊదరగొడుతున్న 7.8శాతం జిడిపి వృద్ధికి వాస్తవానికి పొంతన లేదా? పలువురు ఆర్థిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాలవి! ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామంటూ మోడీ పరివారం చేసుకుంటున్న ప్రచారానికి దేశంలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకపోవడమే దీనికి కారణం. నిజవేతనాలు తగ్గుతూనే ఉండటం, ధరల సంక్షోభం కొనసాగుతుండటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకీ కుదించుకుపోతుండటం, అసమానతలు పెరుగుతుండటం వంటి అంశాలను నిపుణులు కొంతకాలంగా ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా వృద్ధి గణనీయంగా ఉంటే క్షేత్రస్థాయిలో ఇటువంటి పరిస్థితులు ఉండవన్న అభిప్రాయం వీరిలో వ్యక్తమవుతోంది. దీంతో పాటు జిడిపి గణన కోసం అంతర్జాతీయంగా పలు దేశాలు అనుసరిస్తున్న పద్దతికి, భారత దేశం అనుసరిస్తున్న పద్దతికి గణనీయమైన తేడా ఉన్న విషయాన్ని కూడా వీరు ప్రస్తావిస్తున్నారు. అమెరికా బ్యూరో ఆఫ్ ఎనామిక్ అనాలిసిస్ అనుసరించే పద్దతిలో లెక్కిస్తే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 7.8 శాతం నుండి 4.5శాతానికి మన జిడిపి పడిపోతుందని తాజా నిర్ధారణ. ప్రపంచప్రఖ్యాత విశ్వవిద్యాలయం 'ప్రిన్స్‌టన్'లో అంతర్జాతీయ ఆర్థిక విధానాల విజిటింగ్ ప్రొఫెసర్ అశోక్ మోడీ ఈ నిర్ధారణ చేశారు. ఈయన గతంలో ప్రపంచబ్యాంకు ఐఎంఎఫ్ విభాగంలో పనిచేసి ఉండటం గమనార్హం. ఈ నిర్దారణ ప్రకారం 2022 ఏప్రిల్-జూన్‌లో కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన 13.1శాతం జిడిపి నుండి 4.5 శాతానికి భారీ స్థాయిలో జిడిపి పడిపోయిందని చెప్పవచు. అశోక్‌మోడీతో పాటు పలువురు అర్థిక వేత్తలు ఇదే రకమైన విశ్లేషణలు చేస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న పురోగతి లెక్కలను ఇతర దేశాలు అంత తీవ్రంగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారతదేశ అధికారిక గణాంకాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని అశోక్ మోడీ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితమైన లెక్కలు రావాలంటే ఆదాయ, వ్యయాలను రెండింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, భారత ప్రభుత్వం అలా చేయడం లేదని ఆయన చెప్పారు. ఈ మేరకు 'ప్రాజెక్ట్ సిండికేట్' అనే అంతర్జాతీయ మీడియా సంస్థకు ఆయన రాసిన వ్యాసం తాజాగా ప్రచురితమైంది. 'ఇండియాస్ ఫేక్ గ్రోత్ స్టోరీ' పేరిట ప్రచురితమైన ఈ వ్యాసంలో 'జి-20 సదస్సు నిర్వహణ కోసం పేదల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసి ఢిల్లీ నగరాన్ని ముస్తాబు చేస్తున్న విధంగానే జిడిపి లెక్కలను కూడా బ్రాండింగ్.. బ్యూటిఫికేషన్' చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
భారీగా పెరిగిన వ్యత్యాసాలు
జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ జిడిపికి ప్రామాణికంగా తీసుకుంటున్న ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాలు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. -3.4శాతం నుండి 2.8 శాతానికి తాజా గణాంకాల్లో వ్యత్యాసాలు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. దీని ప్రకారం 6.2శాతం వ్యత్యాసాలు పెరిగాయని కొంత కాలంలోనే ఈ స్థాయిలో ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు. జిడిపిలోని వ్యయ భాగాలను విశ్లేషిస్తే ప్రైవేటు వ్యక్తులు చేసే వ్యయం, ప్రభుత్వ వ్యయం, విలువైన వస్తువుల కొనుగోలు కోసం చేసే ఖర్చులు గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తుందని ఆయన తెలిపారు. ఎగుమతులు తగ్గగా, దిగుమతులు పెరిగాయని వివరించారు. దీర్ఘకాల దృష్టితో చేసే మూలధన ఖర్చుల్లో కూడా పెరుగుదల లేదని వివరించారు. అన్ని రంగాల్లో ఖర్చు తగ్గుతుంటే ఆదాయం ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు. 'జిడిపి లెక్కల్లో లోపం ఉంది. ఇది మన దేశం అధికారికంగా ప్రకటించే గణాంకాల్లోని ఖచితత్వాన్ని బోనులో నిలబెడుతుంది.' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు తాజాగా విడుదుల చేసిన లెక్కల ప్రకారం ఏప్రిల్ -జూన్ నెలల మధ్య ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం 7.8శాతం వార్షిక రేటుతో పెరిగిందని, అదే సమయంలో వ్యయం మాత్రం 1.4శాతం మాత్రమే పెరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ స్థాయిలో ఆదాయం పెరిగితే ఇంత తక్కువగా వ్యయం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ ఆర్థిక సూత్రాల ప్రకారం సాధారణ పరిస్థితుల్లో ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయని తెలిపారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు మాత్రం ఆదాయ లెక్కలను మాత్రమే సరైనవిగా భావించి పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాలు జిడిపి గణన కోసం వ్యయాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారని. ఆ తరువాత ఆదాయ, వ్యయాల సగటును మిశ్రమంగా పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు.










