Nov 06,2023 07:50

సగం దేహం ఒడలిపోయి
సగం సహచరిని తలుస్తూ
అండా సెల్‌ గోడల మధ్య
చలికి గడ్డకడుతూ, వొంకర్లు పోతూన్న దేహం
దు:ఖప్రణయాన్ని ఆలపిస్తోంది..

చెట్టు వేళ్లనుండి
రక్తప్రసరణ గుండెకు చేరడం లేదు
మట్టికి చెట్టుకి మధ్య తెగిపడుతున్న
ప్రాణసంబంధం నిలుపుకుంటూ..
బంధాలను ముళ్ళు వేసుకుంటున్న
ఆరాట పోరాటం.. క్షణ క్షణం

ఇది దేశం కోసం
ఇది సగటు మనిషికోసం
స్వీయపఠన కఠోర శిక్ష
భరింప శక్యం కాని బాధల చలి
వెచ్చటి రగ్గు సెగ కోసం ఎదురు తెన్నులాట

అవునూ..
శరీరం చచ్చుబడితే ఏం..
హరితపత్రానికి మెదడుంది
ఆ మెదడు నిరంతరం ఆలోచిస్తుంది
ఆలోచించడమే నేరమని
పది టన్నుల బాంబు కంటే ప్రమాదకరమని కదా
శ్రీమాన్‌ న్యాయస్థానం తీర్పు !

ఓపికలేదు.. ఓదార్పు లేదు...
కొండంత స్టైర్యం ముందు
మీ అధికార దర్పం
ముక్కలు ముక్కలవుతున్న దర్పణం

మంచినీళ్లు నిరాకరణ
బ్లాంకెట్‌ ఇవ్వడానికి నిరాదరణ
అతనిప్పుడు మీకో చలిభూతం
మిమ్మల్ని సరసరా కోసేస్తున్నట్టు
గాలికేగిరిపోయే
పొట్టుపొట్టయిపోతున్న భయంతో
దివ్యాంగమవుతున్న రాజ్య గోముఖాల
రాక్షస కొమ్ము...

మానవత్వపు హక్కుల పూల చెట్టయి..
నిషేధిత పిట్ట రెక్కలకు
ఆకాశ వీధులయ్యి
కనీసపు బతుకుని వెచ్చించుకోడానికి
గొంతులో గొంతుకయి
మాటతో పాటతో
బతుకు భయాన్ని వెళ్లగొట్టి
తిరిగి మొలకెత్తుతున్నందుకా
ఈ మీ నిర్బంధం..!

అయితే మీ కళ్ళల్లోకి చూడండి
ఆ సంకల్ప బలం
ఎత్తైన దారువృక్షాలతో నిండి
మీ దేహాల్ని ఆక్రమిస్తుంది
నిత్య చైతన్య హరితపత్రం
అందాక వేచి చూడండి ...!
(ప్రొఫెసర్‌ సాయిబాబా కోసం)
- నేలపూరి రత్నాజీ
89199 98753