May 14,2023 10:43

సుబ్బయ్య ఒక పాల వ్యాపారి. పాలని ఎలాంటి కల్తీ చేయకుండా అమ్మేవాడు. దాంతో ఊరి ప్రజలందరూ సుబ్బయ్య దగ్గరే పాలను కొనుక్కునేవారు. కొన్ని రోజుల్లోనే సుబ్బయ్య దగ్గర పాలు కొనేవారు పెరిగారు. దాంతో సుబ్బయ్యకి పాలల్లో నీళ్లు కలపాలనే దురాలోచన వచ్చింది. పాలలో నీళ్లు కలిపి అమ్మేవాడు. ఇది గుర్తించిన వినియోగదారులు సుబ్బయ్యను నిందించేవారు. పాలు చాలా పలచగా ఉన్నాయంటూ తిట్టుకోసాగారు. దాంతో సుబ్బయ్యకి చాలా కోపం వచ్చేది. పట్టణం వెళ్లి మార్కెట్లో దొరికే పాలపొడి కొని, దాన్ని పాలల్లో కలిపి, నీళ్లు ఎక్కువ పోసేవాడు. అప్పుడు మరిన్ని పాలు అయ్యేవి. పాలు చిక్కగా, చాలా రుచిగా ఉండడంతో జనం ' మంచి పాలు అమ్ముతున్నాడు' అనుకోసాగారు.
కొంతకాలానికి ఊరిలో పెద్దలు, పిల్లలు అందరూ అనారోగ్యం బారిన పడసాగారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థమయ్యేది కాదు. రాజు అనే యువకుడు సుబ్బయ్య చేసే మోసాన్ని వీడియో తీసి, జనానికి చూపించాడు. దాంతో ఊరి పెద్దలు సుబ్బయ్యను పంచాయతీకి పిలిచి మందలించారు. అతనికి శిక్ష కూడా విధించారు. ఆ రోజు నుంచి సుబ్బయ్య వద్ద ఊరి ప్రజలందరూ పాలు కొనడం మానేశారు. దీనికంతటికీ తన అత్యాశే కారణం అని భావించిన సుబ్బయ్య తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు.
నేస్తాలు చూశారా! 'అత్యాశ వల్ల మన చుట్టూ ఉన్న జనం దగ్గర నమ్మకాన్ని కోల్పోతాం. జీవితంలో నష్టపోతాం.'


harshia

- ఎం. హర్షియ,
10వ తరగతి, ఎం.తిమ్మాపురం ఆదర్శ పాఠశాల,
మహానంది (మం), నంద్యాల జిల్లా.