- సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ. రవి విమర్శ
ప్రజాశక్తి-కె ఆర్ పురం : ఐటిడిఏ లో రెగ్యులర్ పిఓగా ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేఆర్ పురం ఐటిడిఏ లో పిఓ పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించే విధంగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ఇప్పటికే అనేకసార్లు సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు, అక్కడి గిరిజనులు కోరిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వేయడం లేదన్నారు. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా 57 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిందన్నారు. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి కె ఆర్ పురం ఐటిడిఏ లో పిఓగా ఐఏఎస్ అధికారిని నియమించాలనే డిమాండ్ గుర్తు లేకపోవడం హాస్యాస్పదమన్నారు. గిరిజనులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఐటిడిఏకు వస్తే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలంలోని ఇన్చార్జి పిఓ లను నియమించి వారిని కొద్ది కాలం వ్యవధిలోనే బదిలీ చేయడం చాలా బాధాకరమని అన్నారు. రెగ్యులర్ పిఓ లేకపోవడం వలన ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను వినే నాధుడు లేక గిరిజనులు అన్యాయానికి గురవుతున్నారు అని అన్నారు. గిరిజనులు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఐటీడీఏ కేంద్రంగా ఐఏఎస్ అధికారిని ఐటిడిఏ పిఓ గా నియమించాలని రవి డిమాండ్ చేశారు.










