Jul 04,2023 08:09

ఒక గ్రామంలో చందు, చరణ్‌ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారివి పక్క పక్క ఇల్లు. వారు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చందు బాగా చదువుతాడు. కానీ, ఒక్క ఇంగ్లీష్‌ మాత్రం సరిగా చదవలేడు. అలాగే చరణ్‌కు లెక్కలు తప్ప మిగతా సబ్జెక్టులు వస్తాయి. ఆ సబ్జెక్టులు తమకు అర్థం కాకుండా ఉన్నాయనిచందు ఇంగ్లీష్‌ను, చరణ్‌ లెక్కలను చదవడం తగ్గించారు.
కొన్ని రోజుల తర్వాత ఎస్‌ఏ 1 పరీక్షలు జరిగాయి. ఆయా సబ్జెక్టుల్లో ఇద్దరికీ మార్కులు తక్కువ వచ్చాయి. అవి చూసి తోటి పిల్లలు వారిని ఎగతాళి చేశారు. 'మీరు మంచి మిత్రులు కదా. చదువు మాత్రం రాదు' అంటూ ఆట పట్టించారు. చందు, చరణ్‌ ఆ మాటలకు బాధపడి ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. అప్పుడు ఉపాధ్యాయుడు వారితో 'ఇతరులు మనల్ని ఎగతాళి చేశారని బాధపడకూడదు. మనల్ని తిట్టినవారే మెచ్చుకోవాలి అంటే మీరు బాగా చదవాలి.' అని చెప్పారు.
ఆ మాటలు చందు, చరణ్‌లపై ప్రభావం చూపాయి. తమకు రాని ఇంగ్లీష్‌, గణితం సబ్జెక్టులను ఉపాధ్యాయులు చెప్పేటపుడూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళాక చందుకు చరణ్‌ ఇంగ్లీష్‌ చెప్పేవాడు. చరణ్‌కి చందు లెక్కలు వివరించేవాడు. అలా ఒకరికి రాని సబ్జెక్టును మరొకరు వివరంగా అడిగి తెలుసుకోసాగారు.
ఆ తర్వాత కొన్ని రోజులకు జరిగిన ఎస్‌ఏ 2 పరీక్షలలో వారు తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. దాంతో మిగతా పిల్లలందరూ చప్పట్లతో అభినందించారు. 'మీరు మంచి స్నేహితులు. పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారని మెచ్చుకున్నారు. అప్పుడు చరణ్‌, చందు చాలా సంతోషించారు.
 

- ఎం. రాం చరణ్‌,
9వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,
నర్సింహుల పల్లి.