
చిలుకల వనంలో అనేక రామచిలుకలు నివాసం ఉంటున్నాయి.. అన్నింటికంటే బంగారు రంగులో ప్రత్యేకంగా కనిపించే రామ చిలుక చాలా అందంగా ఉండేది. తన అందాన్ని చూసుకుని అది ఎప్పుడూ గర్వపడేది. తానే అందరికంటే గొప్పదానినని భావించేది. ఒకరోజు ఆ దేశపు రాజు విహారానికి ఆ వనానికి వచ్చాడు. వనంలోని ఫల పుష్పాలను చూసి ఆనందిస్తున్న రాజుకు బంగారు చిలుక కనిపించింది. దానిని చూసి ముగ్ధుడైన రాజు ఆ చిలుకను పట్టి తెమ్మని భటులకు ఆజ్ఞాపించి వెళ్ళాడు. భటులు ఎంతో ప్రయాసపడి ఎట్టకేలకు ఆ బంగారు చిలుకను పట్టి రాజ మందిరానికి తీసుకెళ్ళారు.
రాజు దాన్ని పంజరంలో పెట్టి ఎంతో సంతోషించాడు. దేశం నలుమూలల నుంచి మేలైన గింజలు తెప్పించి ఆహారంగా పెట్టాడు. అయితే ఎంత రాజభోగాలు అనుభవిస్తున్నా చిలుక మాత్రం దిగులుగా ఉండేది. ఒక్కసారిగా దానికి వనంలోని తన తోటి చిలుకలు గుర్తుకొచ్చాయి. అవి దాన్ని ఎంత ప్రేమగా చూసుకునేవో జ్ఞాపకం చేసుకుని ఏడ్చింది. అప్పట్లో వాటి విలువ తెలియక వాటిని ఎంత చులకనగా చూశానని తలుచుకుని బాధపడింది.
ఒక రోజు చిలుకలవనంలో చిలకలన్నీ జామచెట్టుపై సమావేశమై బంగారు చిలుక గురించి చర్చించుకున్నాయి. 'బంగారు చిలుక మనలో ఒకటి. దానిని రక్షించుకోవడం మన బాధ్యత. దాన్ని మనం కాపాడుకుందాం' అని చిలుకలన్నీ తీర్మానించుకున్నాయి. మరుసటిరోజు తెల్లవారుజామున గుంపుగా వెళ్ళి రాజ మందిరంలో బంగారు చిలుక ఉన్న చోటుకు చేరుకున్నాయి. ఒక్క ఉదుటున బంగారు చిలుక ఉన్న పంజరాన్ని నోట కరుచుకుని ఎగిరిపోయాయి. చిలుకల అభిమానానికి బంగారు చిలుకకు కళ్ళు చెమర్చాయి. తనను క్షమించమని వాటిని కోరింది. చిలుకలన్నీ కలిసి పంజరం తలుపును తెరిచాయి. బంగారు చిలుక స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయింది.
- గేరపాటి భానువర్ధన్,
81065 86997.