Jul 20,2023 07:15
  •  ఆందోళనలో పోలవరం నిర్వాసితులు
  • గండిపోశమ్మ ఆలయాన్ని చుట్టుముట్టిన వరద నీరు

ప్రజాశక్తి- యంత్రాంగం : ఎగువ రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, శబరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ నదుల్లో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో పోలవరం నిర్వాసితుల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వరద భయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండల కేంద్ర ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్ననికి 30.07 అడుగులు ఉండగా, ఎగువ ఉన్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుంచి వస్తోన్న వరద నీటి వల్ల సాయంత్రానికి 34 అడుగులకు చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటలకు 35 అడుగులకు చేరే అవకాశం ఉందని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 7.2 అడుగుల నీటిమట్టం నమోదైంది. గురువారం ఉదయానికి ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో, ఈ బ్యారేజీ నుంచి
రెండు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం కాపర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 29 మీటర్లకు చేరింది. దీంతో, పోలవరం స్పిల్‌వే నుంచి 1.73 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కాఫర్‌ డ్యామ్‌ వద్ద 29.75 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. గండిపోశమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో, ఆలయాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఆలయ పరిసరాల్లో దుకాణాలు అధికారులు తొలగిస్తున్నారు. చింతూరు ఏజెన్సీ ప్రాంత చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 25 అడుగులకు చేరింది. మండలంలోని సోకులేరు, చంద్రవంక వాగుల్లో క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. పేరూరు వద్ద 5.30 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. సోకులేరు వాగు ఉధృతి వల్ల చింతూరు, విఆర్‌.పురం మండలాల్లో రహదారులు స్తంభించే అవకాశం ఉంది. నదుల్లో నీటి ప్రవాహం పెరిగి ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉన్నందున ముంపు మండలాల పర్యవేక్షణకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌... చింతూరు డివిజన్‌ కేంద్రానికి చేరుకున్నారు. ముంపు మండలాల్లో నిర్వాసిత ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు ఎగువ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలు, హాస్టళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చే పనిలో అధికారులు ఉన్నారు. నిత్యావసరాల నిల్వలను బఫర్‌ స్టాక్‌ సెంటర్లకు తరలించారు. వరదలకు ఎటువంటి ప్రాణనష్టమూ జరగకుండా ఎప్పటికప్పుడు ముంపు ప్రాంత ప్రజానీకానికి సమాచారాన్ని ఇస్తూ అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల ప్రజలనూ గోదావరి వరద భయం వెంటాడుతోంది.