న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన పబ్లిషర్ గీతా ప్రెస్‌కి 2021కి గాను గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయం గాంధీని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. గీతా ప్రెస్ కి శాంతి బహుమతిని ఇవ్వడమంటే హిందూత్వ సిద్ధాంతకర్త విడి.సావర్కర్, మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేలను సన్మానించడమేనని విమర్శించారు. జర్నలిస్ట్ అక్షయ ముకుల్ 2015లో గీతాప్రెస్‌పై రచించిన పుస్తకాన్ని కూడా ప్రస్తావించారు. ఈ పుస్తకంలో మహాత్మాగాంధీకి గీతాప్రెస్‌తో ఉన్న వ్యతిరేకతను పేర్కొన్నారని తెలిపారు.
మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో భారత ప్రభుత్వం ప్రతి ఏడాది గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు కింద కోటి రూపాయలతో పాటు ఓ ప్రశంసాపత్రం, అద్భుతమైన సాంప్రదాయ హస్తకళ వస్తువును ప్రదానం చేస్తారు. గీతా ప్రెస్ ఈ ఏడాది శత దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక పరివర్తనను పెంపొందించేందుకు ఈ సంస్థ గత వందేళ్లుగా ప్రశంసనీయ చర్యలు చేపడుతోందని ప్రధాని మోడీ ట్విటర్‌లో పేర్కొన్నారు.










