ప్రజాశక్తి - జీలుగుమిల్లి : కేంద్ర బిజెపి పాలనలో దేశవ్యాప్తంగా ఆదివాసులపై దాడులు విస్తృతంగా పెరిగాయనీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర అన్నారు. గిరిజన సంఘం ఏలూరు జిల్లా ఏడవ జిల్లా మహాసభలు జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఆమరజీవి కొమరం బొజ్జి, సున్నo రాజయ్య ప్రాంగణంలో మహాసభలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. మహాసభ సంఘం పతాకాన్ని సంఘం జిల్లా సహాయ ఉపాధ్యక్షులు తెల్లo దుర్గారావు ఆవిష్కరించారు. అనంతరం మహాసభలో ఇటీవల కాలంలో మృతి చెందిన వారికి మహాసభ తరఫున సంతాపాన్ని తెలిపారు.కిల్లో సురేంద్ర మహాసభ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ 9 ఏళ్ల బిజెపి పాలనలో అన్ని రాష్ట్రాల్లో గిరిజనులపై దాడులు విస్తృతంగా చేశారని విమర్శించారు.గిరిజనులకి అత్యున్నత హోదా రాష్ట్రపతి పదవి ఇచ్చి కిందిస్థాయిలో నిత్యం ఆదివాసీలపై దాడులు సృష్టించడం సరైనది కాదన్నారు. ఇటీవల జాతీయ అటవీ చట్టాన్ని నూతన అటవీ సంరక్షణ సవరణ తీసుకొచ్చిందని తద్వారా గిరిజనులకు అడవిపై హక్కు లేకుండా చేస్తుందన్నారు.తరతరాలుగా అడవిలో జీవించి అడవిని నమ్ముకున్న ఆదివాసులకు హక్కు పట్టాలు ఇవ్వలేని ప్రభుత్వం అటవీ చట్టాన్ని సవరణ చేయడం ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ బడా వ్యక్తులకు అడుగు భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు. పీసా,ఆర్ వో ఎఫ్ ఆర్ గ్రామసభలు నిర్వహించకుండా ప్రైవేట్ వ్యక్తులకు భూములను కట్టబెట్టేలా ప్రభుత్వం సవరణ చేయడం దుర్మార్గపు చర్యఅన్నారు. అడవులు ప్రైవేట్ బడా కార్పొరేట్ వ్యక్తులకు కేటాయిస్తే 10 కోట్ల మంది ఆదివాసులు అన్యాయం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ వనరులను అడవులు ఖనిజనిక్షేపాలను కొల్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాల్పడు తుందన్నారు. గిరిజనుల హక్కులను ఒక్కొక్కటిగా కుదిస్తూ వారి హక్కులను కాలురాస్తూ బిజెపి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. విభజన హామీలో భాగంగా గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకే పరిమితమైందని విమర్శించారు. తక్షణమే గిరిజన యూనివర్సిటీ భవనప్రారంభ నిర్మాణ చేపట్టాలన్నారు.ఇప్పటికే గిరిజన హక్కులు సుప్రీంకోర్టులో కేసులు వేసి గిరిజనులకు అన్యాయం చేసిందని అన్నారు. జీవో నెంబర్ 3ని కరోనా కాలంలో సుప్రీం కోర్టు కొట్టు వేసిందని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన సక్రమంగా నిర్వహించడం పోవడం వల్ల గిరిజనులు తమ ఉద్యోగాలు పొందే హక్కుల్ని కోల్పోయారన్నారు. ప్రస్తుతం గిరిజనేతరులు 1/70 పరిధిలో తమ హక్కులకు భంగం కలుగుతుంది అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదనీ ఆయన ప్రశ్నించారు. తక్షణమే సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఇప్పటికే రిట్ పిటిషన్ సుప్రీం కోర్టులో వేసిందని ఆయన సూచించారు. అభివృద్ధి చెందిన బోయి వాల్మీకులను గిరిజన జాబితాలో కలపడం రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్య అన్నారు. ఏక సభ్య కమిషన్ శ్యామల ఆనంద్ కుమార్ నివేదికను బహిర్గతం చేయాలని అయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజా సంఘాల అభిప్రాయాలను స్వీకరించకుండా ప్రభుత్వం విధానాన్ని ఏకపక్షంగా ప్రకటించడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో 28 లక్షల గిరిజనులు ఉండగా బోయి వాల్మీకి 40 లక్షల మంది ఉన్నారని బోయ వాల్మీకులకు ఎటువంటి భాష సంప్రదాయ ఆచారాలు లేవని గిరిజన తెగల జీవనం అటవీ ఉత్పత్తుల సేకరణ వారికి లేవని తెలిపారు. గతంలో అనేక కమిషన్లు బోయి వాల్మీకి వారికి గిరిజన తెగల అర్హత లేదని ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకపక్షం నిర్ణయాలతో ఓట్లు కోసమే గిరిజనులను తెగల్లో చేర్చారనీ విమర్శించారు. అభివృద్ధి చెందిన నాన్ ఏజెన్సీ గిరిజనేతరులను గిరిజనుల జాబితాలో కలపడం ద్వారా అన్ని హక్కులు అభివృద్ధి చెందిన బోయి వాల్మీకీలకు హస్తంగతం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం గిరిజన జాబితాలు చేర్చేఅసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి గిరిజన సంఘం పిలుపునిస్తుందన్నారు. ఈ మహాసభలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దర్ముల రమేష్ కార్యక్రమాల కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఈ మహాసభలలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారం,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి పాల్గొన్నారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, సుండ్రు బుల్లెమ్మ, తెల్లం దుర్గారావు, గంగమ్మలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.










