
దసరా వస్తోందని స్కూలు పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడే ఎనిమిదవ తరగతిలోకి ప్రిన్సిపాల్ సార్ వచ్చారు. మాస్టారు క్లాసులోకి వస్తూనే.. 'హాయ్ పిల్లలూ... రేపటి నుండి మనకు దసరా సెలవులు. కాబట్టి మీరంతా జాగ్రత్తగా సెలవులను ఎంజారు చేయండి. అమ్మమ్మ, నానమ్మల ఇంటికి వెళ్లి హాయిగా సెలవులు గడపండి. అక్కడి వాతావరణాన్ని బాగా గమనించండి. సెలవులు అయిపోయి స్కూలుకు వచ్చాక పండుగ ఎలా చేశారో, సెలవులను ఎలా గడిపారో తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వ్యాసం రాయండి. వాటన్నింటినీ తెలుగు టీచర్‌కు ఇవ్వండి. బాగా రాసిన వారికి బహుమతులు ఉంటాయి' అని చెప్పారు. 'నవంబర్ 14న బాలల దినోత్సవం రోజున ఆ పిల్లలకు బహుమతులు అందజేస్తాం' అని కూడా అన్నారు.
మాస్టారు చెప్పిన విషయానికి పిల్లలంతా తెగ సంబరపడ్డారు. ఆ బహుమతులను తామే పొందాలని ఎవరికి వారే ఊహించుకున్నారు. సెలవుల్లో అమ్మమ్మ, తాతయ్యల ఇండ్లకు వెళ్లారు. పచ్చని పంట పొలాలను ఆస్వాదించారు. ప్రకృతిలో పరవశించి ఆడారు. పిల్లలకు పల్లె వాతావరణం బాగా నచ్చింది. పక్షుల కిలకిల రావాలు, జంతువుల అరుపులు ఎంతో గమ్మత్తుగా అనిపించాయి. చూస్తుండగానే సెలవులన్నీ అయిపోయాయి. బడికి వచ్చాక, తాము చూసిన విషయాలను వ్యాసాలుగా రాసి టీచర్‌కి అందించారు. ఈ లోపు బాలల దినోత్సవం రానే వచ్చింది. వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులంటూ పిల్లలందరిలో ప్రకృతిని బాగా వర్ణిస్తూ రాసిన పదవ తరగతి విద్యార్థినికి ప్రథమ బహుమతి ఇచ్చారు.
'పిల్లలు ప్రకృతిని గమనించాలి.. ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత. ప్రకృతిని బాగా పరిశీలించిన మీరంతా ఇప్పటి నుండి పర్యావరణానికి హాని కలిగించే విషయాలపై శ్రద్దపెట్టండి. వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించండి.. మీతో పాటు మీ పెద్దలను కూడా పర్యావరణ రక్షకులుగా మార్చండి. అప్పుడే మనమంతా బాగుంటాం..' అని ప్రిన్సిపాల్ సార్ చేసిన ప్రసంగం పిల్లలందరికీ బాగా నచ్చింది.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655.