Oct 12,2023 08:59

గాజా : దాదాపు 23లక్షల మంది ప్రజలు నివసించే అతిచిన్న గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు విరుచుకుపడుతుండడంతో బుధవారం 18వేల మందికి పైగా పాలస్తీనియన్లు ఐక్యరాజ్య సమితి షెల్టర్లలో తల దాచుకున్నారు. గాజాను ఇజ్రాయిల్‌ అష్ట దిగ్బంధనం చేయడంతో లోపల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌర భవనాలు, పాఠశాలలు, మసీదులపై దాడులతో పాటూ పలు చోట్ల పాలస్తీనియన్లు, సాయుధ ఇజ్రాయిల్‌ బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.
గత 16ఏళ్ళ నుండి ఇజ్రాయిల్‌ దారుణమైన దాడులకు కేంద్రంగా మారిన గాజా నుండి తప్పించుకోవడానికి పాలస్తీనియన్లకు వేరే దారి లేకుండా పోయింది. సురక్షిత ప్రాంతాలుగా భావించబడే ఐక్యరాజ్య సమితి ఆశ్రయాలు కూడా తాజా పోరాటంలో దాడులకు లక్ష్యాలుగా మారుతున్నాయి. ఆదివారం నాటి దాడిలో తమ ఆశ్రయ కేంద్రం ఒకటి నేరుగా దాడికి గురైందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మరుసటిరోజు ఆశ్రయ కేంద్రాలుగా ఉపయోగిస్తున్న ఐదు పాఠశాలల భవనాలు దాడులకు దెబ్బతిన్నాయి. ఎంతమంది మరణించారో వివరాలు అందలేదు. గాజాను పూర్తిగా దిగ్బంధించామని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ తెలిపారు. అయితే ఆహారం, విద్యుత్‌, నీరు, ఇంధనం వంటి సరఫరాలను ఆపివేయడం వల్ల లోపల వున్న ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్‌ వోల్కర్‌ తుర్క్‌ హెచ్చరించారు. గాజాలో పరిస్థితులు చూస్తుంటే ఉత్తర ఐర్లాండ్‌ను పూర్తిగా దిగ్బంధించాలంటూ బ్రిటీష్‌ ఆదేశించిన రోజులు గుర్తుకువస్తున్నాయని మార్క్‌ సెడాన్‌ అనే రచయిత వ్యాఖ్యానించారు.