- కార్పొరేట్లకు డజన్ విమానాశ్రయాలు
- బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం
- రూ.8వేల కోట్ల నిధులపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ : విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ప్రయివేటీకరణకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 11-12 విమానాశ్రయాలను ప్రయివేటీకరించాలని యోచిస్తోంది. వచ్చే బడ్జెట్‌లో దీన్ని వెల్లడించనుందని ఇటి ఓ కథనంలో వెల్లడించింది. విమానయాన రంగంలో ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రూ.8,000 కోట్లు రాబట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విమానయాన రంగంలో భారీగా ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించాలని ఆ మంత్రిత్వ శాఖ చూస్తోంది. దీనిపై వచ్చే బడ్జెట్‌లో కీలక ప్రకటన వెలుపడనుంది. ప్రయివేటీకరణకు వీలుగా 11-12 విమానాశ్రయాల జాబితాను రూపొందించారు. ఇందులో విజయవాడ, రారుపూర్, జైపూర్, కోల్‌కత్తా, ఇండోర్ తదితర కీలక విమానాశ్రయాలు ఉన్నాయి. వీటి ప్రయివేటీకరణతో రూ.8,000 కోట్ల పైగా నిధులను సమీకరించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. దీనిపై ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే 2023-24 బడ్జెట్‌లో ప్రకటన చేయగానే.. తదుపరి ఆమోదానికి పంపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశంలో 146 విమానాశ్రయాలున్నాయి. వీటిని వచ్చే కొన్ని ఏళ్లలో 200 చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఏళ్లలో ఈ రంగంలో బలమైన వృద్థి చోటు చేసుకోనుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సిందియా ఇటీవల పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) పరిధిలోని మరిన్ని విమానాశ్రయాల ప్రయివేటీకరణ ప్రక్రియ కొనసాగనుందన్నారు.










