Sep 05,2023 20:49
  •  పరుగులు పెట్టిన భద్రతా సిబ్బంది
  •  ఆకతాయి పనిగా గుర్తింపు

ప్రజాశక్తి - గన్నవరం : ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. ఈ కాల్‌ ఎయిర్‌పోర్ట్‌ భద్రతా విభాగం అధికారులను పరుగులు పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విజయవాడ విమానాశ్రయంలో సోమవారం రాత్రి 11 గంటలకు ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం దిగింది. ఆ సమయంలో ఓ అగంతకుడు ఎయిర్‌ ఇండియా విభాగానికి ఫోన్‌ చేసి విమానంలో బాంబు పెట్టినట్లు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఎయిర్‌పోర్ట్‌ బాంబ్‌ స్క్వాడ్‌ ఢిల్లీ నుండి వచ్చిన విమానంలో పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏ విధమైన బాంబు లేదని నిర్ధారించుకున్నాక ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతించారు. దీంతో ఢిల్లీ విమానం అరగంట ఆలస్యంగా 12 గంటకు బయలుదేరి వెళ్లింది. తణుకు ప్రాంతం నుండి ఓ వ్యక్తి ఫోన్‌కాల్‌ చేసి బెదిరించాడని గన్నవరం పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.