Jan 20,2021 06:54

మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం ఎంత గందరగోళంలో ఉందో, దాని అమెరికా అనుకూల వైఖరి దేశాన్ని ఎటువంటి అయోమయ స్థితికి నెడుతున్నదో కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఎరుకైంది. పదవి నుంచి వైదొలగుతున్న భారత్‌ లోని అమెరికా రాయబారి కెనెత్‌ జస్టర్‌ వెళ్తూ వెళ్తూ మోడీ ప్రభుత్వానికి కొన్ని హుకుమ్‌లు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, బెదిరింపులు భారత దేశ భద్రతను, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రశ్నార్థకంగా మార్చాయి. బెకా, కామ్‌కాసా వంటి సైనిక ఒప్పందాల పుణ్యమాని ఆయుధ వ్యవస్థల నిర్వహణ, టెక్నాలజీ వినియోగానికి సంబంధించి అనేక షరతులకు భారత్‌ తలొగ్గాల్సి వస్తుంది. మనం ఏ తరహా ఆయుధాలు, టెక్నాలజీ వాడాలో అమెరికానే శాసిస్తుంది. తనకు నచ్చిన ఆయుధాలను, నచ్చిన దేశం నుంచి కొనుగోలు చేసుకునేందుకు భారత్‌కు ఉన్న స్వేచ్ఛను ఇది హరించివేస్తోంది. అంతిమంగా ఇది అమెరికా ఉచ్చులో భారత్‌ను బందీని గావించేందుకు దారి తీస్తుంది. రష్యా నుంచి సుఖోరు-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకుని, ఇప్పటికే కొంత మొత్తాన్ని బయానాగా చెల్లించింది. రష్యాను తన శత్రువుగా పరిగణించే అమెరికా, ఆ దేశం నుంచి ఆయుధాలు కొనడానికి వీల్లేదంటున్నది. తన ఆదేశాన్ని ధిక్కరిస్తే కాట్సా యాక్ట్‌ కింద ఆంక్షల కొరడా ఝుళిపిస్తానని బెదిరిస్తున్నది. రష్యా నుంచి మిలిటరీ పరికరాలను కొనుగోలు చేసే దేశాలపై కాట్సా యాక్ట్‌ను ఒక అస్త్రంగా ప్రయోగించడం అమెరికాకు రివాజుగా మారింది. నాటో కూటమిలో భాగస్వామిగా ఉన్న టర్కీ రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేసినందుకు ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించింది. తమతో వ్యూహాత్మక సైనిక ఒప్పందం కుదుర్చుకున్న ఏ దేశమైనాసరే ఇంకొక దేశం నుంచి అధునాతన ఆయుధాలను, టెక్నాలజీని కొనుగోలు చేయడానికి వీల్లేదన్నట్టుగా అమెరికా రాయబారి మాట్లాడారు. భారత్‌కు ఏదైనా అధునాతన టెక్నాలజీ కావాలనుకుంటే తన నుంచి, లేదా దాని మిత్ర దేశాల నుంచి కొనుక్కోవడం మినహా భారత్‌కు మరో మార్గం లేదని ఏమాత్రం దాపరికం లేకుండా చెప్పేశారు. అంటే భవిష్యత్‌లో రష్యా నుంచి భారత్‌ ఎలాంటి ఆయుధాలు కొనుగోలు చేయడానికి వీల్లేదని పరోక్షంగా హెచ్చరించడమే. అమెరికాకు సైనిక జూనియర్‌ భాగస్వామిగా మారినందుకు భారత్‌ చెల్లించుకుంటున్న మూల్యం ఇది. భారత ప్రభుత్వం ఇస్తున్న 'మేకిన్‌ ఇండియా', 'ఆత్మ నిర్భర్‌' నినాదాలను కూడా అది సహించలేకపోతోంది. అమెరికన్‌ బహుళజాతి కంపెనీలు, ఫైనాన్స్‌ పెట్టుబడి ప్రయోజనాలకు భిన్నంగా ఒక్క అంగుళం కూడా పక్కకు జరగడానికి వీల్లేదంటున్నది. ఈ ఆంక్షల నుంచి తప్పించుకోవడం కోసం మోడీ ప్రభుత్వం అమెరికాకు మరిన్ని రాయితీలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అంటే వారి నుంచి మరింత ఖరీదైన ఆయుధాలను కొనుగోలు చేస్తుందన్న మాట. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరి రష్యాతో భారత్‌ సాంప్రదాయకంగా కొనసాగిస్తూ వస్తున్న స్నేహ సంబంధాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ గత నెలలో ఒక ప్రకటన చేస్తూ భారత్‌-పసిఫిక్‌ వ్యూహం, క్వాడ్‌ కూటమి ఏర్పాటు వంటివి చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల దుందుడుకు చర్యల్లో భాగమే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. చైనా వ్యతిరేక వైఖరి తీసుకున్న ట్రంప్‌-పాంపియో జోడీతో చేతులు కలిపి భారత్‌ తన పరిధిని తానే కుంచించుకుంటున్నది. ప్రధాన దేశాలు చాలావరకు చైనాతో ఏదో ఒక విధంగా ఆర్థిక సంబంధాలను పటిష్టపరచుకునేందుకు యత్నిస్తుంటే, మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నమైన పంథాను అనుసరిస్తున్నది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పదవి నుంచి దిగిపోయే ముందు ఇరాన్‌తో వాణిజ్యం నెరపుతున్న కంపెనీలపై మరిన్ని ఆంక్షలు విధించడం, క్యూబాను తిరిగి 'ఉగ్రవాద దేశాల' జాబితాలో చేర్చడం, వెనిజులా పార్లమెంటు ఎన్నికల తరువాత కూడా గైడోకే తన మద్దతు ఉంటుందంటూ రోజుకో హుకుమ్‌ జారీ చేశారు. అటువంటి వ్యక్తితో భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ చెట్టపట్టాలేసుకుని తిరగడం దేశ ప్రతిష్టను దిగజార్చుతుంది. దక్షిణాసియా లోని ఇరుగుపొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు యత్నించడానికి బదులు అమెరికాకు తోకగా మారడానికే మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. అమెరికాకు భారత్‌ను మరో సౌదీ అరేబియా తరహా భాగస్వామిగా మార్చాలని తహతహలాడుతోంది. బైడెన్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బుధవారం కొలువు తీరుతున్నందున అమెరికాతో సంబంధాలను ఉభయ దేశాలకు ప్రయోజనకరంగా ఉండేలా తిరిగి రూపొందించుకునేందుకు, మన వ్యూహత్మక స్వయంప్రతిపత్తిని పటిష్టపరచేలా చర్యలు చేపట్టేందుకు ఇదొక మంచి అవకాశం. అమెరికా సామ్రాజ్యవాదం ముందు సాగిలపడుతున్న మోడీ ప్రభుత్వం ఇందుకు సిద్ధపడుతుందా అన్నదే ప్రశ్న.