Jul 05,2023 11:36

ఇంఫాల్‌ :   మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. మంగళవారం అర్థరాత్రి తౌబాల్‌ జిల్లాలో ఇండియన్‌ రిజర్వ్డ్‌ బెటాలియన్‌ (ఐఆర్‌బి) క్యాంప్‌ నుండి ఆయుధాలను దోచుకోవడానికి ఓ గుంపు యత్నించింది. ఈ గుంపును భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ ఘటనలో 27 ఏళ్ల వ్యక్తితో పాటు అస్సాం రైఫిల్స్‌కి చెందిన జవానుకి తీవ్ర గాయాలైనట్లు  అధికారులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దోచుకోవడానికి ఖంగాబోక్‌ ప్రాంతంలోని 3వ ఐఆర్‌బి బెటాలియన్‌ శిబిరంలోకి చొరబడేందుకు గుంపు ప్రయత్నించిందని వారు తెలిపారు.  పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన బలగాలు రబ్బరు బుల్లెట్లు, టియర్‌గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారని అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని చాలా పోస్టుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 326 మందిని అరెస్టు చేశారు.   బుధవారం తెల్లవారు జామున కూడా భారీగా కాల్పులు చోటు చేసుకొన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.