Jul 31,2023 19:46

హైదరాబాద్ : గద్దర్ తనకు జరిగిన గుండె చికిత్సపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో 'గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. 
నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేట లోని శ్యామకరణ్ రోడులో అపోలో  స్పెక్ట్రా (Apollo Spectra) హాస్పిటల్ లో ఇటీవల చేరాను. జూలై ఇరువై నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. 
గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి.శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్.నర్సప్ప (అనిస్తీషియా), డాక్టర్ ప్రఫుల్  చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జి. సూర్య ప్రకాశ్, బి.సోమరాజు గారు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను.
నా యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్ పేట్, హైదరాబాద్ కు చెందిన కింది నెంబర్ : 8978480860 (ఫ్రంట్ ఆఫీస్) కు సందేశం పంపవల్సిందిగా విజ్ఞప్తి' అని తెలిపారు. 

అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ కూడా గద్దర్ ఆరోగ్య పరిస్థితిపై పత్రికా ప్రకటన విడుదల చేసింది. 'గుమ్మడి విఠల్ @గద్దర్ గుండె పోటుతో పది రోజుల క్రితం హాస్పటల్ లో చేరాడు. డాక్టర్ దాసరి ప్రసాద్ రావు & ఇతర ప్రత్యేక వైద్యులతో నిరంతర వైద్యం జరుగుతున్నది. సంతృప్తికరంగా కోలుకుంటున్నారని' తెలిపారు.