Aug 08,2023 13:21
  • అధికార లాంఛనాలతో బౌద్ధ సంప్రదాయం ప్రకారం గద్దర్‌ అంత్యక్రియలు

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : అశేష అభిమాన జనవాహిని, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ప్రజా గాయకుడు గద్దర్‌ అంత్యక్రియలు ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో బౌద్ధ సంప్ర దాయం ప్రకారం కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి పోలీసులు గద్దర్‌కు గౌరవవందనం సమర్పించారు. గద్దర్‌ను కడసారిగా చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ''జోహార్‌ గద్దరన్న..., లాంగ్‌ లివ్‌ గద్దరన్న, లాల్‌ సలాం - నీల్‌ సలాం, జైభీమ్‌, గద్దర్‌ ఆశయాలు కొనసా గిద్దాం..., గద్దర్‌ కలలు సాధించుకుందాం..., తెలం గాణ అమర వీరులకు జోహార్‌..'' నినాదాలతో విద్యాలయ ప్రాంగణం మార్మోగింది.
          ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో సోమవారం మధ్యహ్నం 12 గంటల తర్వాత ఎల్‌బి స్టేడియం నుంచి గద్దర్‌ అంతిమయాత్రం ప్రారంభ మయింది. ఎల్‌బి స్టేడియంలో గద్దర్‌ పార్ధివదేహా నికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ శానససభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, తెలంగాణ మంత్రుల తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, సినీ ప్రముఖులు మంచు మోహన్‌బాబు, మనోజ్‌, కొణిదెల నాగబాబు, నిహారిక, అలీ, సిపిఎం నేతలు తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, డిజి నర్సింగరావు, సిపిఐ నాయకులు, టిడిపి నేత పరిటాల శ్రీరామ్‌, తదితరులు విప్లవ జోహార్లు సమర్పించారు. ఎల్‌బి స్టేడియం నుంచి గన్‌పార్క్‌, అంబేద్కర్‌ విగ్రహం, ట్యాంక్‌ బండ్‌ మీదుగా అల్వాల్‌లోని నివాసం వరకు గద్దర్‌ అంతిమయాత్ర కొనసాగింది. వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గద్దర్‌ నివాసానికి వచ్చిన సిఎం కెసిఆర్‌ ఆయనకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్‌ అంత్యక్రియల్లో విషాదం చోటుచేసుకుంది. గద్దర్‌కి అత్యంత ఆప్తుడు, సియాసత్‌ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌(63) గుండెపోటుతో మృతిచెం దారు. సియాసత్‌ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ కిందపడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.