Oct 07,2023 07:06
  • తొలి ఆరు నెలల్లోనే 94 శాతం బడ్జెట్‌ కేటాయింపులు ఖర్చు
  • పనుల కోసం భారీగా పెరుగుతున్న డిమాండ్‌
  •  కేంద్రం షరతులతో లబ్ధిదారులకు భారీ కోత

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా నిధుల కొరతను ఎదుర్కుంటోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో చేసిన అరకొర కేటాయింపులే దీనికి కారణం. ఎకనమిక్‌ టైమ్స్‌, డౌన్‌టుఎర్త్‌తో పాటు పలు జాతీయ మీడియా సంస్థలు వెలువరించిన కథనాల ప్రకారం.. ఈ ఏడాది చేసిన బడ్టెట్‌ కేటాయింపుల్లో దాదాపు 94 శాతం నిధులను ఇప్పటికే ఖర్చు చేశారు. ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఉపాధి హామీ పనుల కోసం క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. కోవిడ్‌ సంవత్సరాలను మినహాయిస్తే ఈ దశాబ్ద కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధి పనులకు డిమాండ్‌ ఏర్పడటం ఇదే మొదటిసారి. పారిశ్రామిక ఉత్పత్తి రంగం పుంజుకోకపోవడం, నిరుద్యోగం పెరగడం, అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరుగుతుండటం ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన షరతుల కారణంగా ఉపాధి హామీ లబ్ధిదారుల సంఖ్యలో ఈ ఏడాది దేశ వ్యాప్తంగా భారీ కోత పడింది. అయినా, ఈ ఏడాది నెలకొన్న పరిస్థితులతో కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ గందరగోళంలో పడినట్లు సమాచారం. యుద్ధ ప్రాతిపదిక అదనపు నిధులను కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అవసరాల మేరకు నిధులు అందడంపై అనుమానాలు నెలకొన్నాయి.

  • కేటాయింపులు ఎంత? ఖర్చు ఎంత?

గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఉపాధి హామీ చట్టం కింద దేశ వ్యాప్తంగా రూ.73 వేల కోట్లు ఖర్చు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.90 వేల కోట్లు అవసరమవుతాయన్నది నిపుణుల అంచనా. ముందస్తు బడ్జెట్‌ అంచనాల్లో కూడా 2023-24 సంవత్సరానికి రూ.89,400 కోట్లు కావాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం కేవలం రూ.60 వేల కోట్లు కేటాయింపులతో సరిపెట్టింది. ఇది స్థూల దేశీయ ఉత్పత్తిలో 0.198 శాతం మాత్రమే! వామపక్షాల ఒత్తిడితో 2005వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన ఈ చట్టం అమలుకు ఇంత తక్కువ మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి! బడ్జెట్‌ ప్రతిపాదన సమయంలోనే విమర్శలు వచ్చినా మోడీ సర్కారు పట్టించుకోలేదు. కేటాయించిన రూ.60 వేల కోట్లలో ఇప్పటికే రూ.56,100 కోట్లు ఖర్చయ్యాయి. ఇక మిగిలింది రూ.3,900 కోట్లు మాత్రమే. మరోవైపు దేశ వాప్తంగా పూర్తయిన పనులకు గానూ రూ.18 వేల కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. ఇదికాక, కనీసం మరో రూ.2,500 కోట్లు అదనపు బకాయిలు ఉండే అవకాశం ఉందని అంచనా! ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో నెలకొన్న పరిస్థితి. దీంతో మిగిలిన ఆరు నెలలకు నిధులు సర్దుబాటు విషయం ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు నిధుల కోసం విజ్ఞప్తి చేసినా అంత పెద్ద మొత్తంలో నిధులను మోడీ ప్రభుత్వం కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు గరిష్టంగా రూ.10 వేల కోట్లను మాత్రమే అదనపు కేటాయింపులు చేసి ఉండటం గమనార్హం.

  • డిమాండ్‌ ఇలా!

మొదటి ఆరు నెలల కాలంలో ఈ ఏడాది ఉపాధి హామీ చట్టం కింద పనులు కోరుతూ దేశ వ్యాప్తంగా 5.40 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4.80 కోట్ల మందికి మాత్రమే పనులు దొరికాయి. పనులు చేసిన వారిలో కూడా పలువురికి బకాయిలు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఉపాధి రంగం పుంజుకోకపోవడంతో రానున్న ఆరు నెలల కాలంలో ఉపాధి పనులు కోరే వారి సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.

  • ఆంక్షలతో కుదింపు!

ఉపాధి హామీ చట్టం కింద ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం పెడుతున్న అనేక ఆంక్షల కారణంగా లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గుతోంది. ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, 2022-23లో దేశ వ్యాప్తంగా 5.20 కోట్ల మంది జాబ్‌కార్డులు కోల్పోయారు. అర్హత లేని వారిని తొలగించడం, కొత్తవారిని చేర్చడం అనేది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ అంతకముందు సంవత్సరంతో పోలిస్తే తొలగింపులు 247 శాతం పెరగడం గమనార్హం. ఆధార్‌ ఆధారిత చెల్లింపు విధానాన్ని తప్పనిసరి చేయడంతో మిగిలిన వారిలో 40 శాతం మంది మాత్రమే అర్హులుగా తేలారు. దీంతో ఇతరులు ఉపాధి పనులు చేసినా వేతనాలను పొందలేకపోతున్నారు. ఈ చట్టం ప్రకారం వంద రోజులు కనీస పని కల్పించాల్సి ఉండగా, అనేక రాష్ట్రాల్లో ఆ నిబంధనను అమలు చేయడం లేదు. కేంద్రం నుండి అందిన నిధులు నామమాత్రమే కావడంతో అనేక రాష్ట్రాల్లో 20 నుండి 25 రోజుల మాత్రమే పనులు కల్పిస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ డేటా ప్రకారం మొదటి ఆరు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా 6.68 లక్షల మందికి మాత్రమే వంద రోజుల పని దొరికింది.

  • ఆంధ్రప్రదేశ్‌లో ఇలా...

రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం పెద్ద ఎత్తున నిధుల లోటును ఎదుర్కుంటోంది. ఒక అంచనా ప్రకారం కేంద్రం నుండి రావాల్సిన నిధులు రూ.1,067 కోట్లు మేర తగ్గాయి. దీంతో లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా కుదిస్తున్నారు. వివిధ కారణాలతో 80 లక్షల మంది పేర్లను తొలగించారు. మరోవైపు గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఉపాధి పనులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. గతేడాది జులై నెలలో 11 లక్షల మంది, ఆగస్టులో 62 లక్షల మంది ఈ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా.. జూన్‌ నెలలో 37 లక్షల మంది, జులైలో 23 లక్షల మంది, ఆగస్టులో 81 లక్షల మంది ఈ చట్టం కింద పనుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.