
- అడుగడుగునా నీరుగార్చే కుట్ర
- మోడీ మెడలు వంచైనా పథకాన్ని కాపాడుకుంటాం
- వ్యకాసం రాష్ట్ర అధ్యక్షుడు దడాల
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : దేశంలోని పేద ప్రజానీకానికి చేతినిండా పనీ, మూడు పూటలా తిండి పెడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అన్నారు. ఉపాధి కూలీలపై ఉన్న సవతి ప్రేమతోనే బడ్జెట్లో భారీగా కోత పెట్టిందంటూ ఉద్ఘాటించారు. మోడీ చెర నుంచి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందామంటూ స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉపాధి కూలీలు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దడాల సుబ్బారావు హాజరై ప్రసంగించారు. ఉపాధి హామీ పనుల్లో కేవలం వ్యవసాయ కూలీలే కాకుండా చేతివృత్తిదారులు, నిరుద్యోగ యువత పాలుపంచుకుంటుందని వివరించారు. అయితే మోదీ ప్రభుత్వం భారీ కోతలు పెడుతోందని వాపోయారు. గత ఉపాధి హామీ సంవత్సరానికి బడ్జెట్లో రూ.90 వేల కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల జాబ్ కార్డులు ఉండగా, అవసరమైన బడ్జెట్ 2.5లక్షల కోట్లనీ, మరి మోడీ ప్రభుత్వం కేవలం 60 వేల కోట్లతోనే సరిపెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో పని లేక పస్తులంటున్న ఉపాధి కూలీలకు ఒక్కో కుటుంబానికి రూ.7500 ఇవ్వమంటే ఇవ్వని మోడీ, కార్పొరేట్లకు మాత్రం రూ.4.5 లక్షల కోట్లను రాయితీ కింద మాఫీ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఉపాధి చట్టం ఓ దండగ అంటోందనీ, వైసీపీ మంత్రులు సైతం అందుకు వంత పాడుతున్నారని వాపోయారు. ఉపాధి పనులు కెళ్లే కూలీలను సోమరిపోతుల్లా వైసీపీ మంత్రులు చిత్రీకరిస్తున్నారనీ, ఆ పథకాన్ని రైతుల చేతుల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతుల చేతుల్లో ఉన్న భూములు పేద కూలీలకిచ్చేస్తే, ఉపాధి కూలీల సౌఖ్యాన్ని రైతులకిచేస్తారంటూ సవాల్ విసిరారు. ఉపాధి పనులు జరిగే చోట కనీస వసతులు కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నీడ, నీరు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలన్న కనీస స్పృహ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక సమ్మర్ అలవెన్సులకు కోత పెట్టగా, తట్టా, బుట్ట, పారా, గడ్డపార కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టిందంటూ ఏద్దేవా చేశారు. మూడు నెలలకోసారి కూడా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించడం లేదనీ, పని చేసి 15 రోజులు దాటితే 0.5 శాతం వడ్డీతో బకాయి చెల్లించాలని చట్టం చెబుతోందన్నారు. మొత్తం మీద మోడీ ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని నీరు గార్చే కుట్ర చేస్తోందనీ, వ్యవసాయ కూలీలు కేంద్రం మెడలు వంచైనా పథకాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్డీవో రామారావుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి తలారి బాలకృష్ణ, మురుగేష్, గురవమ్మ, వందవాసి నాగరాజు, అంగేరి పుల్లయ్య, గంధం మణి, నాగరాజు, వరలక్ష్మి, దినమణి, చెల్లమ్మ, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.