May 29,2023 22:09
  • పనుల కోసం రాజకీయ నేతలను నిలదీయాలి
  • మచిలీపట్నంలో ధర్నా, కలెక్టర్‌తో రాయబారం

ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కాలక్రమంలో దాన్ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. తొమ్మిదేళ్ల బిజెపి మోడీ పాలనలో కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఉపాధి హామీ పనులకు కోత పెడుతూ రావడమే దీనికి నిదర్శనమని తెలిపారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు, ఈ చట్టాన్ని మరింత మెరుగుపరుకోవడానికి ఎపి వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద సోమవారం కలెక్టర్‌తో రాయబారం, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రఘు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాఘవులు మాట్లాడుతూ ఉపాధి చట్టం ప్రకారం కార్మికులకు వంద రోజులు పని కల్పించడానికి రూ.2.70 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.23 వేల కోట్లు కోత విధించిందన్నారు. ఈ ఏడాది కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. ఈ కేటాయింపులు దేశంలో 16 రోజులు పని కల్పించడానికి మాత్రమే సరిపోతాయన్నారు. కృష్ణా జిల్లాలో సగటున 40 రోజులు పని కల్పిస్తున్నట్లు చెబుతున్నారని, దేశవ్యాప్తంగా ఆ మేరకు కార్మికులకు పని కల్పించాలన్నా బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఇలా క్రమంగా ఉపాధి హామీ పనులకు నిధులు తగ్గించి కార్మికులే పనికి రావడం లేదని చెబుతూ ఉపాధి చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే పనిచేయకుండానే కార్మికులు డబ్బులు తీసుకుంటున్నారని, సోమరిపోతులు అవుతున్నారని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. ఈ వాదనలన్నీ వ్యవసాయ కార్మికులను అవమానించడానికేనని, కార్మికులను ఇంకా దగా చేయడానికి చేసే ప్రయత్నాలని అన్నారు. వాస్తవంగా ఉపాధి హామీ పనులు దేశానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచిన్న పనులు పూర్తి చేసుకోవడానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులు దోహదపడుతున్నాయన్నారు. దేశంలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం రూ.16 లక్షల కోట్ల మేర రుణాలు మాఫీ చేసిందని, ఈ నిధులను ఉపాధి చట్టానికి కేటాయిస్తే దేశంలో ప్రతి వ్యవసాయ కార్మికునికీ 15 ఏళ్లపాటు వంద రోజులు పని కల్పించేందుకు సరిపోతాయని తెలిపారు. ఓట్ల కోసం వచ్చే పార్టీల నాయకులను ఈ చట్టం ద్వారా గ్రామాల్లో వంద రోజులు పని కల్పించాలని డిమాండ్‌ చేయాలని రాఘవులు కోరారు. వంద రోజులు పని కల్పించడానికి ఎవరు అండగా నిలుస్తారో గుర్తించాలన్నారు. గ్రామాల్లో ఇబ్బందుల పరిష్కారానికి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకు రావాలని, సమస్యలపై మండల, జిల్లా అధికారులకు అర్జీలు ఇవ్వాలని కోరారు. చెరువుల తవ్వకం పనుల ద్వారా ఉపాధి పని కల్పించాలని, ఇతర సౌకర్యాలు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ చట్టాన్ని ఉంచాలా? వద్దా? అని చర్చించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌ కమిటీ వేయడానికి సిద్ధపడిందన్నారు. కృష్ణా జిల్లాలో వ్యవసాయ కార్మికులకు చేసిన పనికి సంబంధించి రూ.22 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. జిల్లాలో లక్షమంది జాబ్‌కార్డులకు అర్హులుగా ఉన్నా, వారికి కార్డులు రావడం లేదన్నారు. కేరళలో మాదిరిగా ఉపాధి కార్మికులకు వేతనం ఇవ్వాలని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని టిడిపి మహానాడులో వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇదే జరిగితే వ్యవసాయ కార్మికుల డబ్బులు భూస్వాముల జేబుల్లోకి వెళతాయని తెలిపారు. టిడిపి ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు ధర్నా చౌక్‌ వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఈ రాయబార కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శీలం ప్రకాశరావు, సంఘం నాయకులు అజ్మీర్‌ వెంకటేశ్వరరావు, ఎం..మోహనరావు, బండారు కోటేశ్వరరావు, జన్నగడ్డ భాస్కరరావు, ఐనంపూడి వెంకటేశ్వరరావు, బి.కీర్తి, అబ్దుల్‌ బారీ తదితరులు పాల్గన్నారు.