అనగనగా ఒక చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉంది. చెట్టు మీద కోతి, కోకిల ఉండేవి. చెరువులో ఒక తాబేలు ఉండేది. చిన్నప్పుడు అవి మూడూ కలిసి చెరువు గట్టు మీద ఆడుకునేవి. పాడుకునేవి. కోతి తన అమ్మానాన్నలతో ఎక్కువగా ఉండేది. కోకిల, తాబేలుకు అమ్మానాన్నలు లేరు. దాంతో అవి ఒంటరిగా ఉండేవి.
కోతి వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు చెట్టుపై నుంచి ఈ మూడింటిని చూస్తూ ఉండేది. అది చూసి కోకిల 'మీ అమ్మ ఎప్పుడూ నిన్ను గమనిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి' అన్నాయి తాబేలమ్మ, కోకిలమ్మ. 'అవును మా అమ్మ లేకుంటే నేను ఏమౌపోయేదాన్నో.' అన్నది కోతి పిల.్ల
కొంత కాలానికి అవి మూడు బతకటానికి వేర్వేరు చోట్లకు వెళ్లిపోయాయి. కొన్ని రోజులకు అవి మూడూ చెరువు ఒడ్డున కలిశాయి. అప్పుడు కోతి తన బుజ్జి కోతి పిల్లను పొట్టకు తగిలించుకొని వచ్చింది. బుజ్జి కోతికి కోకిలమ్మ, తాబేలమ్మలను పరిచయం చేసింది. 'ఇదిగో! ఈ ఇద్దరితో చిన్నప్పుడు ఈ చెరువు దగ్గర ఆడుకునే దాన్ని.' అని చెప్పింది. కోకిలమ్మకు, తాబేలమ్మలకు నమస్కరించింది బుజ్జి కోతి. బుజ్జికోతి సంస్కారానికి ముచ్చటపడ్డాయి కోకిలమ్మ, తాబేలమ్మ.
'మీ పిల్లలను తీసుకు రాలేదా?' అని కోకిలను, తాబేలును అడిగింది కోతి.
'నేను గుడ్లను పెట్టి ఇసుకతో కప్పేస్తాను. వాటిని పొదగమూ, పట్టించుకోమూ. పిల్లలను కూడా పెంచం. అవి మాతో కలిసి ఉండవు. తలో దిక్కు వెళ్లిపోతాయి' అంది తాబేలు.
కోకిల కూడా అలాగే చెప్పింది. 'నేను కాకమ్మ గూటిలో గుడ్లు పెడతాను. కాకమ్మ పొదిగి పిల్లలను చేస్తుంది. ఆ తర్వాత అవి రెక్కలొచ్చి ఎక్కడికో పోతాయి.' అంది. విని, కోతి ఆశ్చర్యపోయింది.
'మిత్రమా! దీనికి నీవు ఆశ్చర్యపోవద్దు. చిన్నప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పెరిగావు. కాబట్టి నీవూ నీ పిల్లల్ని పెంచుతున్నావు. మేమూ మా అమ్మల దగ్గర పెరగలేదు. అందుకే మా పిల్లల్ని మేమూ పెంచడం లేదు. ఏదైనా, అమ్మానాన్నలు పాటిస్తేనే కదా, పిల్లలూ పాటిస్తారు.' అంది తాబేలు.
'సరే మిత్రులారా! చీకటి పడుతుంది. బుజ్జి కోతి భయపడుతుంది. ఇక నేను ఇంటికి వెళతాను. మళ్లీ కలుద్దాం'.'' అని ఆనందంగా కోతిపిల్లని తన కడుపునకు తగిలించుకోని తన ఇంటికి బయల్దేరింది కోతి.
- పైడిమర్రి రామకృష్ణ
92475 64699










