పక్షికి స్వేచ్ఛ వుంటే
అది రెక్కలు విదిల్చి
గాల్లో చక్కెర్లు కొడుతుంది
నదికి స్వేచ్ఛ వుంటే
అది జలపట్టీలను కదిల్చి
రాళ్లపై నాట్యం చేస్తుంది
చెట్లకు స్వేచ్ఛ వుంటే
అవి పచ్చదనాన్ని ధరించి
ప్రపంచానికి ఇంకాస్తా
అందాన్ని అద్దుతాయి
చిన్ని పాపకు స్వేచ్ఛ వుంటే
తన కలల పడవలను వర్షంలో విడిచి
ఊహల్లో ప్రయాణం చేస్తుంది
తరగతి గదికి స్వేచ్ఛ వుంటే
అది పిల్లలను మనసారా హత్తుకుని
నల్లబల్లపై దేశం భవిష్యత్ బొమ్మను
చిత్రిస్తుంది
- సుందరం










