
ఒక వనంలో వసంత అనే కోకిల నివసించేది. అది ఉదయం, సాయంత్రం వేళల్లో చక్కగా రాగాలు తీస్తూ పాడేది. ఆ పాటలు విని వనంలోని పక్షులు, జంతువులు పరవశించి పోయేవి. కాని కోకిల మాత్రం తన రూపం నలుపు రంగు గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది.
ఒక రోజు వనంలో ఉన్న కోతి కోకిల దగ్గరకు వచ్చింది. ''వసంత కోకిలా నీ గొంతు చాలా బాగుంటుంది. ప్రతిరోజూ నీ గానం వింటూ ఆనందపడిపోతున్నాను' అన్నది. కాని కోకిల మాత్రం నిరుత్సాహంగానే కోతి మాటలు వింటుంది. అది గమనించిన కోతి 'ఎందుకు దిగులుగా ఉన్నావు కోకిలా' అన్నది. 'నా గొంతు బాగున్నా... నా రంగు నల్లగా ఉంది. అదే నెమలి, చిలుకలు చూడు. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో!' అని మనసులో బాధను చెప్పుకుంది కోకిల.
దాంతో కోతి 'చూడు వసంత కోకిలా.. అలా ఆలోచించకు. రామచిలుక, నెమళ్లు అందంగా ఉంటాయి.. నిజమే. అందుకే వాటిని మానవులు బంధిస్తున్నారు. పంజరంలో పెడుతున్నారు. నెమళ్లను వేటాడతారు. మానవుల నుంచి అవి నిరంతరం తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. వాటికి చాలా సమస్యలు, బాధలు ఉంటాయి. నీకు అలా కాదు. నీవు స్వేచ్ఛ జీవివి. నీ గొంతు అంటే అందరికీ ఇష్టం. అందుకే నీ జోలి ఎవరూ రారు. స్వేచ్ఛకు మించిన అందమూ ఆనందమూ లోకంలో ఏమున్నాయి?' అంది.
ఆ మాటల్లోని వాస్తవాన్ని గ్రహించిన కోకిల అప్పటినుంచి సంతోషంగా జీవించ సాగింది.
- మొర్రి గోపి
88978 82202