Oct 30,2022 08:25
  • రెండు నెలలకు కలిపి ఒకేసారి పంపిణీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందే ఉచిత బియ్యం పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల కాకపోవడంతో అక్టోబర్‌ నెల బియ్యం పంపిణీకి బ్రేక్‌ పడింది. నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం ఒకే సారి మూడు నెలలు (అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌) కోటాను విడుదల చేసినప్పటికీ రవాణా ఛార్జీలకు అవసరమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అక్టోబర్‌ నెల దాదాపుగా పూర్తికావడంతో నవంబర్‌లో రెండు నెలలకు సంబంధించిన బియ్యంను పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్‌ అన్నయోజన పథకం(పిఎంజికెఎవై)లో భాగంగా జాతీయ ఆహార భద్రత యాక్ట్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు కలిపి 3.24 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంను కేటాయించింది. 89లక్షల కార్డుదారులకు అవసరమైన స్ధాయిలో బియ్యం నిల్వలు లేక పోవడంతో పాటు ఎఫ్‌సిఐ గౌడోన్‌ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు, అక్కడ నుంచి చౌకధరల దుకాణాలకు రవాణా చార్జీలకు సంబంధించి నిధుల కేటాయింపులకు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనికి సంబంధించిన ఫైలు ఆర్ధికశాఖవద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆర్ధికశాఖ క్లియరెన్స్‌ రాగానే అక్టోబరు, నవంబరు నెలలకు కలిపి ఒకేసారి పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.