Aug 21,2022 06:59

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. 76వ సంవత్సరంలోకి అడుగెడుతూ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలని చెప్పుకుంటున్నాం. కాని, దేశ జనాభా అంతటికీ నాణ్యమైన విద్య, వైద్యం, వాటర్‌ అందడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందో తెలుస్తోంది.
         ప్రస్తుత మన దేశం విద్యా వ్యవస్థను పరిశీలిస్తే, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత మరియు సాంకేతిక విద్య వరకూ నిధుల లేమితో సతమతమవుతున్న పరిస్థితి. విద్యకు జాతీయ ఆదాయం (జిడిపి)లో కనీసం 6 శాతం నిధులు మంజూరు చేయాలని 1966లో కొఠారి కమిషన్‌ చెప్పిన సూచన నేటికీ నెరవేరలేదు. ప్రాథమిక విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు లేవని అసర్‌ వంటి సర్వే తెల్పుతోంది. దీనికి ప్రధాన కారణం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడమే. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాతృ భాషకు బదులు ఆంగ్ల భాషకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతున్నది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్యాలయాలు వరకు ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగా వున్నాయి. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ వారితో బోధన సాగుతోంది. లేబరేటరీలు, లైబ్రరీల కొరత వుంది. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నైపుణ్యాలు, నాణ్యత కలిగిన విద్యార్థులు లేక దేశం సతమతం అవుతున్నది. అదే సమయంలో ప్రైవేటీకరణ వలన బడుగు బలహీన వర్గాల వారికి విద్య అందని ద్రాక్ష వలే ఉంటుంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నా, రాష్ట్రాల అభిప్రాయాలు, కనీసం పార్లమెంట్‌లో చర్చ లేకుండానే కేవలం కేంద్ర కేబినెట్‌ ఆమోదంతో 2020 నూతన విద్యా విధానం తీసుకుని రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నాణ్యమైన, నైపుణ్యాలు కలిగిన విద్య అందరికీ ఎలా వస్తుందో ఆలోచన చేయాలి.
                   స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకూ వెంటాడుతున్న అతి ప్రధానమైన సమస్య రక్షిత మంచినీరు. నేటికీ అందరికీ అందుబాటులో లేదు. ''జలశక్తి'' వంటి పథకాలు ప్రారంభించినా నేటికీ దేశంలో 52 శాతం జనాభాకు మాత్రమే మంచినీటి సరఫరా అందుబాటులో ఉంది. చాలామంది తమ ఆదాయాన్ని వెచ్చించి ప్రైవేటు సంస్థలు ద్వారా మంచినీరు కొనుక్కుని తాగాల్సి వస్తోంది. అయినప్పటికీ మంచినీరు దొరక్క, కలుషిత నీరు తాగడం వలన అనేక మంది అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. 2018 నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం 600 మిలియన్ల మంది మంచినీరు దొరక్క సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. 70 శాతం భూగర్భ జలం కలుషితమైంది. ప్రపంచంలో 2.45 శాతం నేల కలిగి, 4 శాతం మంచినీరు వనరులు ఉన్నా మన దేశంలో ''హైడ్రాలజీ మేనేజ్‌మెంట్‌'' సరిగ్గా లేకపోవడం వల్ల తాగునీటి సమస్యలతో సతమతమవుతున్నాం. రాబోయే ఐదేళ్ళలో మంచినీరు అందించే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నదుల అనుసంధానంపై దృష్టి కేంద్రీకరించాలి. నీటి కాలుష్యంపై అవగాహన కల్పించాలి.
                 ఇక వైద్య రంగ పరిస్థితి కోవిడ్‌ కాలంలో స్పష్టంగా వెల్లడైంది. దేశంలో వైద్య విధానంలో ముఖ్యంగా ప్రభుత్వం వైద్య రంగంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియవచ్చింది. కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు చేరి తమ ఆదాయాన్ని, కొన్ని సందర్భాల్లో అప్పులు చేసి, ఆస్తులు అమ్మి ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఎంత ప్రయాస పడుతున్నారో మన కళ్ళముందే కదలాడుతూ ఉన్న సజీవ సాక్ష్యాలు. ఆయుష్మాన్‌భవ వంటి పథకాలు ప్రారంభించినా ఫలితాలు అంతంత మాత్రమే. 5.9 లక్షల గ్రామాల్లో సుమారు ఒక బిలియన్‌ భారత్‌ జనాభా నివసిస్తున్నారు. దేశంలో 1.56 లక్షల సబ్‌సెంటర్లు, 25,140 పి.హెచ్‌.సిలు, 5481 కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. పి.హెచ్‌.సి లలో 64.2 శాతం హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21.8 శాతం డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లో మార్చి 31, 2021 నాటికి మంజూరు అయిన సర్జన్‌ పోస్టుల్లో 72.3 శాతం, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు 64.2 శాతం, ఫిజీషియన్‌ పోస్టులు 69.2 శాతం, పిల్లల వైద్యుల పోస్టులు 67.1 శాతం ఖాళీగా ఉండటం ద్వారా మన దేశంలో వైద్య రంగం ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇకనైనా వైద్య రంగం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రస్తుత గణాంకాల ప్రకారం భారతదేశంలో 13.01 లక్షల అల్లోపతి వైద్యులు, 5.65 లక్షల ఆయుష్‌ వైద్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న 140 కోట్ల భారత జనాభాకు ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదని గ్రహించాలి. నేటికీ గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలను, రోగులను సమీప వైద్యశాలలకు తరలించాలంటే డోలీలే శరణ్యం. సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కోకొల్లలు. నిజమైన అభివృద్ధి అంటే ప్రజల జీవితాలు మెరుగైన స్థితిలో ఉండడం. కనీస అవసరాలయిన ఆహారం, నీరు, విద్య, వైద్యం అందరికీ కల్పించాలి. అందుకుగాను బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి.కనీసం రాబోయే ఐదేళ్ళలో అంటే ఎనభయ్యవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నాటికైనా ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.
                                             - ఐ. ప్రసాదరావు, సెల్‌ :6305682733