Mar 27,2023 12:44

పారిస్‌  : పెన్షన్‌ సవరణలను వ్యతిరేకిస్తూ కొన్ని వారాలుగా చేపడుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో పెన్షన్‌ సంక్షోభంపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాలతో చర్చించాలని యోచిస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజిబెత్‌ బోర్న్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎలిజిబెత్‌ బోర్న్‌ రాజకీయ నేతలతో, ట్రేడ్‌ యూనియన్స్‌తో చర్చలు ప్రారంభించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. వచ్చే వారంలో ఈ చర్చలు ప్రారంభంకావచ్చని పేర్కొన్నారు. తాము సరైన మార్గాన్ని కనుగొంటామని, ప్రజలు శాతించాలని ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో తాను రెండు లక్ష్యాలను సాధించాలని మీడియాకు వివరించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం, రెండు ఫ్రెంచ్‌ ప్రజల అంచనాలకు తగిన విధంగా సమాధానమివ్వడం అని అన్నారు.

అయితే కాన్సిస్ట్యూషనల్‌ కౌన్సిల్‌  ఆమోదించిన పెన్షన్ల సంస్కరణ బిల్లు కొనసాగుతుందని అన్నారు. బోర్న్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 49.3ని వినియోగించి ఈ పెన్షన చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. గతేడాది మేలో బోర్న్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బోర్న్‌ 49.3 నిబంధనను 11 సార్లు వినియోగించారు. ఇకపై ఆర్థిక విషయాల్లో ఈ ఆర్టికల్‌ను వినియోగించనని బోర్న్‌ మీడియాకు వివరించారు.
పెన్షన్‌ చట్టానికి వ్యతిరేకిస్తూ మార్చి 28న 10వ  దేశవ్యాప్త నిరసనకు ట్రేడ్‌ యూనియన్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మాక్రాన్‌ ఈ పెన్షన్‌ చట్టాన్ని ఆరు నెలల పాటు పక్కన పెట్టాలని, కార్మికులతో చర్చలు జరపాలని సిఎఫ్‌డిటి యూనియన్‌ అధ్యక్షుడు లారెంట్‌ బెర్గర్‌ తెలిపారు.