Aug 12,2023 08:17
  • సున్నా వడ్డీ నిధులు విడుదల

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పుంగనూరు ఘటన చాలా బాధాకరమని, ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రత్నిస్తున్నా యని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో డ్వాక్రా మహిళలకు నాలుగో విడత సున్నా వడ్డీ నిధులను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలయోగి స్టేడియంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 'అంగళ్లులో చంద్రబాబు స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టారు. పుంగనూరులో అనుమతిలేని రూట్లో వెళ్లేందుకు యత్నించారు. ఆ రూట్లో వెళ్లొద్దని చెప్పినా వినలేదు. చంద్రబాబు 47 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారు. ఆయన కారణంగా ఓ పోలీసుకు కన్నుపోయింది. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడడం లేదు. ఇలాంటి నేతలకు ఎందుకు రక్షణ ఇవ్వాలని అని అనిపిస్తోంది. వలంటీర్లు ఎవరో కాదు... మీ చుట్టుపక్కల ఇళ్ల నుంచి వచ్చిన వారే. వాళ్లను కూడా వదలకుండా దారుణంగా మాట్లాడారు' అని పేర్కొన్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి అమలు చేయకుండా డ్వాక్రా మహిళలను నడిరోడ్డు మీద నిలబెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.14 వేల కోట్లకుపైగా బకాయిలను వైసిపి ప్రభుత్వం వచ్చాక చెల్లించామన్నారు. 2016లో సున్న వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని, ఆయన చేసిన మోసానికి ఎ, బి గ్రేడ్‌ సంఘాలన్నీ సి, డి గ్రేడ్‌లకు దిగజారాయని పేర్కొన్నారు. మహిళలు కుటుంబ సారథులుగా, ఇంటి దీపాలుగా పూర్తి బాధ్యత వహిస్తూ ప్రగతిపథంలో నడవాలనే సంకల్పంతో వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడత వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకంలో భాగంగా రూ.1353.76 కోట్లను జమేశామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన నాలుగు విడతల్లో రూ.4969.05 కోట్ల మేర అందించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, సంక్షేమ పథకాల లబ్ధిని మహిళల పేరునే అందిస్తూ మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. అక్కా, చెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు, జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌, జోగి రమేష్‌, ఎంపిలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతా అనురాధ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, జడ్‌పి చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, కలెక్టర్‌ హిమాన్షు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.