Oct 19,2023 10:20

న్యూఢిల్లీ : ప్రపంచ పెన్షన్‌ సూచికలో భారత్‌ స్థానం పడిపోతోంది. 2022 సూచికలో మన దేశం 41వ స్థానంలో (మొత్తం దేశాలు 44) ఉండగా ఈ సంవత్సరం 45వ స్థానానికి (మొత్తం దేశాలు 47) పడిపోయింది. అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ కంపెనీ మెర్సర్‌, మరో సంస్థ సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్‌ ఈ సూచికలను విడుదల చేశాయి. పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ స్థానాలను నిర్ణయించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు వారికి ఏ మేరకు సరిపోతాయి, భవిష్యత్తులో వారి జీవితం ఎలా ఉంటుంది, పెన్షన్‌ వ్యవస్థపై వారిలో ఉన్న నమ్మకం వంటి విషయాలను గమనంలోకి తీసుకున్నారు. పెన్షన్‌ ర్యాంకుల్లో నెదర్లాండ్‌ ప్రథమ స్థానంలో నిలవగా ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ సూచికలు వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదని, అవి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోలేదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.