మోంటేవీడియో : ప్రభుత్వ పెన్షన్ సవరణను వ్యతిరేకిస్తూ ఉరుగ్వే కార్మికులు నేడు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. నేషనల్ వర్కర్స్ కన్వెన్షన్ (పిఐటి-సిఎన్‌టి) ఈ నెల 25న 24 గంటల పాటు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెలో భాగంగా నేడు ఉరుగ్వే శాసనసభ భవనం ఎదుట ర్యాలీ చేపట్టనున్నట్లు పిఐటి -సిఎన్‌టి అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. ఉరుగ్వే అధ్యక్షుడు లూయిస్ లకాల్ పౌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ సంస్కరణపై ఈ వారం పార్లమెంటులో చర్చ జరగనుంది. ఈ సంస్కరణను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు పిఐటి -సిఎన్‌టి ప్రకటించింది. ఒకవేళ ఆమోదం పొందితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ఈ సవరణ కార్మికుల హక్కులను కొల్లగొడుతుందని పిఐటి-సిఎన్‌టి అధ్యక్షుడు మార్కెలో తెలిపారు. ఈ సంస్కరణను ప్రజల మద్దతు లేకుండా ప్రవేశపెట్టారని, అందుకే ఓటు వేయకుండా ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాల పదవీ విరమణ వయస్సును చాంబర్ ఆఫ్ డిప్యూటీస్ 65కి పెంచిందని, చర్చల అనంతరం ఈ సవరణ బిల్లు పార్లమెంటుకు వచ్చిందని అన్నారు. బిల్లులో పదవీవిరమణ వయస్సును 63గా ప్రతిపాదించినట్లు తెలిపారు. పదవీ విరమణ వయస్సు పెంపుదల కార్మిక వర్గాలకు హానికరమని యూనియన్ వాదిస్తోంది.










