రాయదుర్గం (అనంతపురం) : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ను విడుదల చేయాలని కోరుతూ ... ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రాయదుర్గంలో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంట సమయంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన దీక్షా శిబిరం వద్ద స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికే చేరుకున్నారు. శ్రీనివాసులతోపాటు వందలాదిమంది కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడ ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ శ్రీనివాసులతో మాట్లాడుతూ ... నిరాహార దీక్షకు అనుమతి లేదని దీక్షను విరమించాలని కోరారు. అయితే తమ నాయకుని అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన విడుదల చేసే వరకు తన దీక్ష కొనసాగిస్తానని కాలవ శ్రీనివాసులు అన్నారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకొని నినాదాలు చేశారు. భారీ పోలీసు బలగాలతో శ్రీనివాసులును పోలీస్ స్టేషన్ కు తరలించారు.