న్యూఢిల్లీ : 2016లో జరిగిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై జరుపుతున్న విచారణకు సహకరించాల్సిందిగా ఫ్రాన్స్ న్యాయస్థానం భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అధికారికంగా అభ్యర్థన పంపిందని ఫ్రాన్స్‌కు చెందిన మీడియాపార్ట్ అనే వెబ్‌సైట్ తెలిపింది. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకూ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా 26 రఫేల్ ఎం నౌకాదళ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై ఆయన సంతకాలు చేసే అవకాశం ఉంది. దీని విలువ రూ.90 వేల కోట్లు. అయితే మోడీ పర్యటనకు కొద్ది రోజుల ముందు ఫ్రాన్స్ న్యాయస్థానానికి చెందిన మెజిస్ట్రేట్లు భారత ప్రభుత్వానికి అభ్యర్థన పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 సెప్టెంబర్‌లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ నుండి 39 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.59 వేల కోట్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే ఈ ఒప్పందంలో అవినీతి, పక్షపాతం చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా ఈ కేసుకు సంబంధించిన పత్రాలను అధ్యయనం చేసేందుకు ఫ్రాన్స్ న్యాయమూర్తులు ఆసక్తి చూపుతున్నారని వెబ్‌సైట్ తెలిపింది. ఈ ఒప్పందం కోసం డస్సాల్ట్ సంస్థ భారత్‌లోని ఓ మధ్యవర్తికి రహస్యంగా అనేక మిలియన్ యూరోలు ముట్టజెప్పిందని ఆ వెబ్‌సైట్ గతంలో తెలిపింది. దాని కథనం ప్రకారం రఫేల్ యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసే డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీ 2007-2012 మధ్యకాలంలో భారత్‌లోని మధ్యవర్తి సుషేన్ గుప్తాకు 7.5 మిలియన్ యూరోలు అందించింది. ఈ లావాదేవీలకు సంబంధించి భారత్‌లోని విచారణ సంస్థలు తగిన ఆధారాలు సేకరించాయి. అయితే ఈ ఆరోపణలను డస్సాల్ట్ సంస్థ, భారత ప్రభుత్వం ఖండించాయి. న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరపాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్ణయం వెనుక అనుమానాలు ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.










