- ఇంకా ఖరారు కాని ఒప్పందం
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుండి 26 రఫేల్-ఎం యుద్ధ విమానాలు, మూడు స్కార్పేన్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ధరను, సాంకేతిక-వాణిజ్య వివరాలను ఖరారు చేసే ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జలాంతర్గాముల ప్రాజెక్టుకు సంబంధించి మన దేశానికి చెందిన ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ మజగాన్ డాక్ లిమిటెడ్, ఫ్రాన్స్‌కు చెందిన నౌకాదళ గ్రూపు ఈ నెల 6న ఒక ఒప్పందాన్ని ఖరారు చేశాయి. అయితే ధర, సాంకేతిక వివరాలపై జరుగుతున్న చర్చలు ఇంకా పూర్తి కాలేదు. రఫేల్ విమానాల సేకరణకు సంబంధించి సైతం సాంకేతిక, వాణిజ్య వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. రఫేల్ విమానాలు, జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి భారత నౌకాదళం చేసిన ప్రతిపాదనకు ఈ నెల 13న ఫ్రాన్స్ రక్షణ సేకరణ మండలి (డీఏసీ) ఆమోదం తెలిపింది. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ప్రారంభించారు. ఆ పర్యటనలోనే కొనుగోలు ఒప్పందాలపై ప్రకటన వెలువడుతుందని భావించారు. అయితే మోడీ పర్యటన సందర్భంగా రూపొందించిన ప్రణాళికలో దీనిని చేర్చలేదు. ధర పైన, యుద్ధ విమానాలు, జలాంతర్గాములను అందజేసే తేదీ పైన సంప్రదింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ధర నిర్ణయం కానప్పటికీ 9-10 బిలియన్ యూరోల మధ్య ఉండవచ్చునని అంచనా.










