Jan 26,2021 19:55

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన మంగళవారం నాటి 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాఫెల్‌ యుద్ధ విమానాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత వాయుసేనకు చెందిన ఈ విమానాలు స్వాతంత్య్ర దినోత్సవ లేదా రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రాఫెల్‌ విమానం రిపబ్లిక్‌ డే ఫ్లైఫాస్ట్‌లో మొదటిసారిగా గాలిలో 'బ్రహ్మస్త్ర' ఫార్మేషన్‌(ఆకారాన్ని) ఒంటరిగానే ఏర్పాటు చేసింది. మరో ఇతర నాలుగు యుద్ధ విమానాలతో కలిసి 'ఏకలవ్య' ఫార్మేషన్‌ను ప్రదర్శించించి వీక్షకులను అబ్బురపరిచింది. రెండు జాగ్వార్‌లు, మరో రెండు మిగ్‌-29 యుద్ధ విమానాలతో కలిసి భూమికి దాదాపు 300 మీటర్ల ఎత్తులో 'వి' ఆకారంలో ప్రదర్శనకు రాఫెల్‌ జెట్‌ ఆగ్రభాగాన ఉండి నాయకత్వం వహించింది. ఇక బ్రహ్మాస్త్ర ఫార్మేషన్‌లో భాగంగా రాఫెల్‌ కొంత ఎత్తు వరకు తక్కువ దూరంలో ప్రయాణించి, తరువాత 90 డిగ్రీల లంబకోణం తీసుకొని అధిక ఎత్తుకు చేరుకునే ముందు రోల్స్‌(పల్టీలు) నిర్వహించడంతో అక్కడకు వచ్చిన వీక్షకులు చప్పట్లు కొట్టారు. ఫ్రాన్స్‌ తయారు చేసిన ఈ రాఫెల్‌ భారత వాయుసేన(ఐఎఎఫ్‌)లో గతేడాది సెప్టెంబర్‌ 10న చేరిన విషయం తెలిసిందే. ఇంకా ఈ రిపబ్లిక్‌ ఫ్లైఫాస్ట్‌ వేడుకల్లో వాయుసేన తరపున మొత్తం 38 యుద్ధ విమానాలు, నాలుగు జెట్‌లు పాల్గొన్నాయి.