May 31,2023 14:59

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి విగ్రహ పునః ప్రతిష్ట ఇంకొల్లు మండలంలోని చింతలపాలెం గ్రామంలో బుధవారం వేడుకగా జరిగింది. ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాన్ని గ్రామస్తులు, దేశ, విదేశాల్లో స్థిరపడిన వారు, భక్తుల సహాయ సహకారాలతో పునర్నిర్మించారు. ఏడాది కాలంలో అందరి సహకారంతో ఈ నిర్మాణం పూర్తి ఐంది. ఈ ఆలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి విగ్రహ పునః ప్రతిష్ట జరిగింది. ఈ విగ్రహానికి ఐదు శతాబ్దాల చరిత్ర ఉందని వేద పండితులు వివరించారు. జయవిజయులు, గరుత్మంతుని నూతన విగ్రహాలు, నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట కూడా ఈ సందర్భంగా జరిగింది. అనంతరం, శ్రీ సీతారామ చంద్రుల వారి, వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుత దీపాలతో అలంకరించారు. విగ్రహ పునః ప్రతిష్ట, గత నాలుగు రోజులుగా జరుగుతున్నా పూజాదికాలు, కళ్యాణాల్లో దేశ, విదేశాల్లో స్థిరపడిన, చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాచమనేని సుధాకర్ పర్యవేక్షణలో నిర్మించిన ఆలయంలో శ్రీమాన్ నారాయణం బాలసుబ్రమణ్యం నేతృత్వంలోని వేదపండితుల బృందం పూజాదికాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో యాచమనేని నాగేశ్వర రావు, శ్రీదేవి, బిజినేపల్లి రాజశేఖర్, రాధా దేవి, గుమ్మడపు వాసుదేవరావు, సింధు,  యాచమనేని జగన్నాధరావు, విజయ, రావు వేణుగోపాలరావు, సింధు దంపతులు పాలుపంచుకున్నారు. తిరుపతి వేదపాఠశాలలో వేదాభ్యసన చేసిన వేదపండితులు నాలుగు రోజులు పూజాదికాలు నిర్వహించారు. ఇటీవలనే గ్రామంలో నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు  జరిగాయి.