Jul 29,2023 22:20
  • భద్రాచలం వద్ద 3వ, కాటన్‌ బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరికలు కొనసాగింపు
  • అంతకంతకూ పెరుగుతున్న నీటి ఉధృతితో ఆందోళన
  • సురక్షిత ప్రాంతాలకు ముంపు, లంక గ్రామాల ప్రజలు

ప్రజాశక్తి-యంత్రాంగం : గోదావరి నది వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శనివారం వరద ప్రవాహం మరింత ఎక్కువైంది. దీంతో, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు కొందరు స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. మరికొందరిని అధికారులు తరలించారు. ఇంకొందరు తమ గ్రామాలకు సమీపంలోని ఎత్తైన ప్రాంతాల్లోనూ, కొండలపైనా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడికి తరలివెళ్లారు. పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువవ్వడంతో వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 55.90 అడుగులు, కాటన్‌ బ్యారేజీ వద్ద 15 అడుగుల నీటిమట్టం నమోదైంది. కాటన్‌ బ్యారేజీ నుంచి సముద్రంలోకి 14,80,093 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 35 మీటర్లకు చేరింది. దిగువకు 12.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. పోలవరం ముంపు మండలాలైన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విఆర్‌.పురం, కూనవరం, చింతూరు, ఎటపాకల మండలాలను వరద చుట్టుముట్టింది. స్థానికంగా వరుణుడు కరుణించినా ఎగువ నుంచి గోదావరి, శబరి ప్రవాహాలు పెరగడంతో వందల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూనవరం మండలంలోని దాదాపు అన్ని గ్రామాలనూ వరద నీరు చుట్టుముట్టింది. ఇప్పటికే ఈ మండలంలోని పది పంచాయతీల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్వర్టర్‌, సోలార్‌ పవర్‌ పాడైపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అత్యధిక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇప్పటికే 31కుపైగా గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. 2,700 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు, గుట్టలు, కొండలపైకి తరలివెళ్లారు. వరద పెరుగుతుండడంతో ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం కాఫర్‌ డ్యాం వద్ద మరో రెండు మీటర్ల వరద పెరిగితే ఈ రెండు మండలాల్లోని అత్యధిక గ్రామాలు వరద ముంపులో చిక్కుకోనున్నాయి.

  • ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గింది. ఈ బ్యారేజీకి ఉదయం నుంచి 1.78 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. మొత్తం అన్ని గేట్లూ ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి 1.30 లక్షల క్యూసెక్కులకు ప్రవాహం తగ్గింది. తెలంగాణలోని ఖమ్మం, నల్గండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతోపాటు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజి ఎగువన కురిసిన వర్షాలతో మున్నేరు, కట్టలేరు, బుడమేరు, పాలేరు తదితర ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తోంది. అయితే, గత రెండు రోజుల కన్నా ఉధృతి తగ్గింది. ప్రస్తుతం పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు. పులిచింతలలో మాత్రం నీటిమట్టం పెరుగుతోంది. సాగర్‌కు దిగువన, పులిచింతల ఎగువన కురిసిన వర్షాలతో 50 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. పులిచింతలలో గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా, శనివారం రాత్రికి 30.74 టిఎంసిల నీటి నిల్వ ఉంది.

  • వరంగల్‌ భద్రకాళి చెరువు మట్టకట్ట కోత

తెలంగాణలోని జూరాల జలాశయం 30 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వరంగల్‌ భద్రకాళి చెరువు కట్ట కోతకు గురై తెగిపోవడంతో పోతన నగర్‌ను వరద నీరు ముంచెత్తింది.