Jan 16,2023 22:32
  • విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో రూ.150 కోట్లతో ఫ్లోటింగ్‌ జెట్టీల ఏర్పాటుకు డిపిఆర్‌ సిద్ధం
  • ఫింగర్‌ జట్టీలే కావాలంటున్న మత్స్యకారులు

ప్రజాశక్తిా గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో రూ.150 కోట్లతో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఆధునీకరణ పనుల పేరుతో వేలాడే జెట్టీలను నిర్మించి ప్రమాదాలుగనక చోటుచేసుకుంటే ఆ వంకతో అక్కడ నుంచి శాశ్వతంగా మత్స్యకారులను తరలించే ఆలోచన దీని వెనుక ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫింగర్‌ జెట్టీలు నిర్మించాలని మత్స్యకారులు కోరుతుండగా ఫ్లోటింగ్‌ జెట్టీల నిర్మాణానికి డిపిఆర్‌ సిద్ధమైంది. దీనిపై మత్స్యకారుల అభిప్రాయాలు తీసుకోకుండానే కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలని చూస్తున్నాయి. దీనివల్ల తమకు ఉపయోగం ఉండదని మత్స్యకారులు చెప్తున్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో 11 జెట్టీలు ఉన్నాయి. ఇవి మత్స్యకారులకు ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి. పెరిగిన అవసరాల దృష్ట్యా ఇవి చాలడం లేదు. దీంతో, కొత్త జెట్టీల నిర్మాణం తెరపైకి వచ్చింది. అప్పట్లో రూ.40 కోట్లతో డిపిఆర్‌ తయారైంది.గత టిడిపి ప్రభుత్వం రూ.23 కోట్లకు పాలనా ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం ఇవ్వాల్సిన 50 శాతం నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయకపోవడంతో ఆచరణ రూపం దాల్చలేదు. కేంద్రంలో అధికారంలోన్న బిజెపి ప్రభుత్వం జెట్టీల విషయంలో తన విధానాన్ని మార్చుకుంది. ఫ్లోటింగ్‌ జెట్టీల నిర్మాణంపై వైపు మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక 2019లో వీటిపై మళ్లీ చర్చ మొదలైంది. అప్పటి కేంద్ర షిప్పింగ్‌ శాఖ మంత్రి గిరిధర్‌ సింగ్‌ విశాఖ హార్బర్‌కు విచ్చేసి రూ.100 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి వెళ్లిపోయారు. కానీ, ఒక్క రూపాయీ విడుదల కాలేదు. ఈలోగా 2022లో ఈ డిపిఆర్‌ రూ.150 కోట్లకు ఎగబాకింది. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ పక్కనే ప్రయివేట్‌ విసిటిపిఎల్‌ విస్తరణ బెర్తు ఏర్పాటు కావడంతో ప్రయివేట్‌ వ్యాపారుల లాభార్జనే ధ్యేయంగా ఫింగర్‌ జెట్టీకి కాకుండా ఫ్లోటింగ్‌ జెట్టీ దిశగా పాలకులు అడుగులు వేస్తున్నారు. 20 ఏళ్లుగా ఒక్క వెసెల్‌ను కూడా తీయడానికి కృషి చేయలేదు.

  • మత్స్యకారులు ఎలాంటి ఆధునీకరణ కోరుతున్నారు

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో 700 వరకూ మెకనైజ్డ్‌ (ఆధునిక బోట్లు), మరో మూడు వేల వరకూ చిన్నచిన్న బోట్లూ ఉన్నాయి. మొత్తంగా 15 వేల మంది మత్స్యకారులు ఈ హార్బర్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. డ్రైయింగ్‌ ప్లాట్‌ఫారాలు, కోల్డ్‌ స్టోరేజీ, శానిటేషన్‌ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. 200 బోట్ల కోసం మాత్రమే గతంలో 11 జెట్టీలను నిర్మించారు. ఓ వైపు బోట్లు సంఖ్య పెరుగుతున్నా జెట్టీల సంఖ్య పెరగలేదు. మరోవైపు ఉన్న జెట్టీల్లో కొన్నింటిపై కోస్ట్‌గార్డ్‌ల పెత్తనం ఉండడంతో మత్స్యకారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో బోట్ల నిలుపుదలకు ఫిషింగ్‌ హార్బర్‌లో స్థలాభావం పెద్ద సమస్యగా మారింది. మత్స్యసంపదను సముద్రం నుంచి వేగంగా తెచ్చుకుని అమ్ముకోవడం, రవాణాకు అనువుగా ఉండేలా ఆధునీకరణ జరగాలని, కొత్తగా ఫింగర్‌ జట్టీలు నిర్మించాలని మత్స్యకారులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఫ్లోటింగ్‌ జెట్టీలతో సమస్యలు తలెత్తనున్నాయని, దీనిపైకి 30 మంది మత్స్యకారులు వెళితే జెట్టీ మునిగిపోవడం ఖాయమని మత్స్యకార సంఘం నాయకులు చంద్రశేఖర్‌ 'ప్రజాశక్తి'కి తెలిపారు. ఫింగర్‌ జట్టీపైకి వందమంది వెళ్లినా ఏమీకాదని పేర్కొన్నారు. కనీసం బోట్ల యజమానులతో సమావేశం నిర్వహించి ఫ్లోటింగ్‌ హార్బర్‌ జెట్టీపై అభిప్రాయం తీసుకోలేదని ఆయన అంటున్నారు.