
న్యూఢిల్లీ : జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సరికొత్త చరిత్రను సృష్టించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణపతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా చిలిచారు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ 88.17 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి రజత పతకం రాగా, చెక్ కాంస్యం సొంతం చేసుకుంది. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజా స్వర్ణంతో నీరజ్ అథ్లెటిక్స్‌లోని అన్ని ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా రికార్డు సృష్టించారు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ ఖాతాలో మూడు స్వర్ణ పతకాలు చేరాయి. అయితే ఈ మూడు పతకాలలో రెండు నీరజ్ సాధించినవే కావడం గమనార్హం.
నీరజ్ చోప్రా 2016లో ప్రపంచ అండర్ 20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచ్చాడు. 2017 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో మొదటిసారి పాల్గొని.. 15వ స్థానంలో నిలిచాడు. 2017లోనే భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన నీరజ్.. 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు.
2021లో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణంతో మెరిశాడు. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో మరోసారి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.