Jul 24,2023 22:35
  • మహారాష్ట్ర మరట్వాడలో దారుణం

ముంబయి : మహారాష్ట్రలో మరట్వాడ ప్రాంతంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 483 మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జూన్‌లోనే అత్యధికంగా 92 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర రెవిన్యూ అధికారులు సోమవారం వెల్లడించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నెలలవారీగా ఈ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. జనవరిలో 62 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఫిబ్రవరిలో 74, మార్చిలో 78, ఏప్రిల్‌లో 89 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మేలో కొద్దిగా తగ్గినా 88 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలో వారీగా చూస్తే బీడ్‌ జిల్లాలో అత్యధికంగా 128 మంది, ఓస్మానబాద్‌లో 90 మంది, నాండెడ్‌ జిల్లాలో 89 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బీడ్‌ జిల్లా ఈ నెల 2న ప్రమాణస్వీకారం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండే సొంత జిల్లా కావడం విశేషం. 483 ఆత్మహత్యల్లో 304 మంది పరిహారానికి ఆర్హులుగా గుర్తించామని, మరో 112 కేసులు విచారణలో ఉన్నాయని అధికారులు తెలిపారు.